ఆర్కే పురం, మార్చి 4: అభివృద్ధి, సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సరూర్నగర్ డివిజన పరిధిలోని హుడా కాంప్లెక్స్, హుడా కాలనీలో వివిధ శాఖల అధికారుల తో కలిసి పర్యటించి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కాలనీవాసులు ఎమ్మెల్యే దృష్టికి పలు సమస్యలను తీసుకురావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హుడా కాంప్లెక్స్ పెరిగిన జనాభా కనుగుణంగా డ్రైనేజీ సామర్థ్యాన్ని పెంచేందుకు పనులకు ప్రతిపాదన సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. కాలనీలోని సమస్యలను ప్రజలు తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు పాటుపడతామన్నారు. అదేవిధంగా అసంపూర్తిగా ఉన్న మహిళా మండలి భవనాన్ని త్వరగా పూర్తిచేస్తే 15వ తారీకు నాడు ఇనాగరేషన్ చేస్తానని చెప్పారు.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మాజీ సీఎం కేసీఆర్ ఒక విజన్ తో మిషన్ భగీరథ, కాకతీయ ద్వారా త్రాగునీరు, సాగునీరు అందించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉన్న నీటిని అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ యూత్ వింగ్ మాజీ అధ్యక్షులు లోకసాని కొండల్ రెడ్డి, సరూర్నగర్ సర్కిల్ డిసి సుజాత, టీఆర్ఎస్ నాయకులు ధర్పల్లి రాజశేఖర్, సిరిపురం రాజేష్ గౌడ్, కొండ గిరి గౌడ్, సుశీల రెడ్డి, ప్రత్యూష, ఇస్మాయిల్, జహీర్ తదితరులు ఉన్నారు.