సిటీ బ్యూరో, బంజారాహిల్స్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): దివంగత మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలన సమయలో స్థానికంగా ఆయన చేసిన అభివృద్ధి పనులను బస్తీల ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. నియోజకవర్గంలోని బస్తీల్లో ఉండే దినసరి కూలీలు, చిరుద్యోగులు, సాధారణ కుటుంబాలు ఫంక్షన్ హాళ్లలో పెండ్లిళ్లు, వేడుకలు జరుపుకోవాలంటే భారంగా ఉండేది. వారి కష్టాలను గుర్తించిన మాగంటి అప్పట్లో రహ్మత్‌నగర్ డివిజన్ హబీబ్ ఫాతిమానగర్ ఫేజ్-2లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
రూ.1.45 కోట్లతో నిర్మాణం..
బీఆర్ఎస్ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో రూ.1.45 కోట్లతో మాగంటి గోపీనాథ్ 2021లో ఫాతిమానగర్‌లో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిధులను కూడా మంజూరు చేయించి పనులు ప్రారంభించారు. దీంతో శంకుస్థాపన చేసిన రెండేండ్లలోనే (2023 నవంబర్ వరకు) 90శాతం పనులు పూర్తిచేశారు.శుభకార్యాలు జరుపుకొనేవారికి భవనంలో అధునాతన హంగులు కలిగి సెంట్రల్ ఏసీతో కూడిన పెద్ద హాల్, వెయిటింగ్ రూమ్‌లు, లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కన్వెన్షన్ హాల్ మాదిరిగా అన్ని హంగులతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్‌ను నిర్మించారు. నియోజకవర్గంలోని ఏ బస్తీ ప్రజలైనా ఇక్కడ వేడుకలు నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు.
పార్టీ కార్యక్రమాలకు వినియోగిస్తున్న కాంగ్రెస్..
దివంగత మాగంటి గోపీనాథ్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను అన్ని హంగులతో నిర్మించి తుది మెరుగులుదిద్ది జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మిగిలిన పనులను పూర్తిచేయకుండా తాత్సారం చేసింది. తదనంతరం మాగంటి అకాల మరణంతో ఫంక్షన్‌హాల్ గురించి పట్టించుకునేవారే కరువయ్యారు. అయితే పేద ప్రజల శుభకార్యాల కోసం నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను కాంగ్రెస్ మంత్రులు మాత్రం పార్టీ సమావేశాలు, సభలకు వినియోగిస్తున్నారు. దీనిపై మాగంటి అభిమానులతో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫంక్షన్ హాల్ అందుబాటులోకి వస్తే బీఆర్ఎస్ పార్టీకి మంచిపేరు వస్తుందనే.. కాంగ్రెస్ తాత్సారం చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెబుతామని స్థానికులు చెబుతున్నారు.
బీఆర్ఎస్కు పేరొస్తుందనే ప్రారంభించడం లేదు
జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని పదేండ్లలో మాగంటి గోపీనాథ్ ఎంత అభివృద్ధి చేశారో ఈ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌ను చూస్తే తెలుస్తుంది. నియోజకవర్గ ప్రజలను మాగంటి కన్నబిడ్డల్లా చూసుకున్నారు. ఆయన నిర్మించిన ఫంక్షన్ హాల్‌ను ప్రారంభిస్తే ఆయన కుటుంబంతో పాటు బీఆర్ఎస్కు మంచిపేరు వస్తుందనే కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్ని ప్రారంభించడం లేదు. పేద ప్రజలు శుభకార్యాలకు వాడుకోవాల్సిన భవనాన్ని కాంగ్రెస్ మంత్రులు తమ పార్టీ సమావేశాలకు వినియోగించడం సిగ్గుచేటు. – షేక్ అబ్దుల్ గనీ, బస్తీ అధ్యక్షుడు, హెచ్‌ఎఫ్‌నగర్ ఫేజ్-2