హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తేతెలంగాణ): ‘జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ మంత్రులు, నాయకులను ఆరు గ్యారెంటీ లేమయ్యాయని గల్లాపట్టి అడగండి..’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఆకు రౌడీలు, చిల్లర గూండాలకు భయపడవద్దని సూచించారు. జూబ్లీహిల్స్‌లో సునీతమ్మ గెలుపు ఖాయమని కూరగాయల, చిరు వ్యాపారులకు అండగా ఉంటామని అభయమిచ్చారు. మళ్లా వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని పేదలందరికీ మేలు చేస్తామని భరోసానిచ్చారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మాజీ కార్పొరేటర్ షఫీ ఆధ్వర్యంలో, కేటీఆర్ సమక్షంలో ఎంఐఎం నాయకులు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తనదైన శైలిలో పంచులతో కాంగ్రెస్ సర్కారుపై విరుచుకుపడ్డారు.
వీధి వ్యాపారులను కాంగ్రెస్ అరిగోస పెడుతున్నదని ఆరోపించారు. శని, ఆది వారాల్లో బుల్డోజర్లతో పేదల ఇండ్లపై విరుచుకుపడుతూ నేలమట్టం చేస్తున్నదని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఏమో అనుకున్నామని..కానీ ఇండ్లు కూలగొట్టుడు..పేదల పొట్టగొట్టుడేనా అని నిలదీశారు. రేవంత్ సర్కారు రెండేళ్లలో చేసిన ఒక్క మంచిపని లేదని.. కానీ హైడ్రా తెచ్చి ప్రజల బతుకులను ఛిద్రం చేస్తున్నదని ధ్వజమెత్తారు. పదేళ్లలో అన్నివర్గాలకు మంచి చేసిన కారు పార్టీ.. నిరుపేదల గూడును కూలకొట్టిన బుల్డోజర్ మధ్య పోటీ నడుస్తున్నదని చెప్పారు. ప్రజలు ఆలోచించి కారు కావాలా? బేకార్ కాంగ్రెస్ కావాలా? తేల్చుకోవాలని సూచించారు. ఒక్కనాడు పొరపాటు చేస్తే మరో మూడేళ్లు అష్టకష్టాలు పడాల్సి వస్తుందనే విషయాన్ని విస్మరించవద్దని విజ్ఞప్తి చేశారు.
జూబ్లీహిల్స్‌లో హస్తం పార్టీ అభ్యర్థికి ఓటమి తప్పదని అర్థమై పోయిందన్నారు. అందుకే ఒక్కో ఓటుకు రూ. 5000 చొప్పున పంచేందుకు సిద్ధమైందన్నారు. ‘కాంగ్రెస్ నాయకులు దోచుకున్న సొమ్మును బరాబర్ తీసుకోండి… ఓటు మాత్రం ఆలోచించి వేయండి..కారు గుర్తుపై గుద్ది బుల్డోజర్ పార్టీకి బుద్ధి చెప్పండి..’ అంటూ కేటీఆర్ పిలుపునిచ్చారు. అలాగే వందరోజుల్లో ఇస్తామని చెప్పిన తులం బంగారం, విద్యార్థులకు రాజీవ్ యువవికాసం, ఆడపిల్లలకు స్కూటీలు ఏమయ్యాయని గట్టిగా నిలదీయాలని కోరారు.
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ బీఆర్ఎస్ నేతల అంతుచూస్తామని, నియోజకవర్గం దాటకముందే ఖతం చేస్తామని బెదిరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. గెలువకముందే నీల్గుతూ విర్రవీగుతున్నారని ధ్వజమెత్తారు. ఓటుతోనే మోసపూరిత పార్టీ కండ్లు తెరిపించాలని కోరారు. హస్తం నాయకుల మాయమాటలు నమ్మితే అసలుకే మోసం వస్తుందనే విషయాన్ని గుర్తెరుగాలని సూచించారు. మోసపూరిత కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాతపెట్టాలని సూచించారు.
చిరువ్యాపారులు, కూరగాయలు అమ్ముకొనే ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ప్రకటించారు. సునీతమ్మ గెలిచిన వెంటనే షేక్‌పేట, బోరబండ, రహ్మత్ నగర్‌లోని వ్యాపారులను కలిసి భరోసా ఇప్పిచ్చే బాధ్యత తనదని ప్రకటించారు. అలాగే పక్క నియోజకవర్గం కూకట్‌పల్లిలోని చిన్న చిన్న దుకాణ దారులకు సైతం అండగా ఉంటామని స్పష్టం చేశారు. అక్కడి ఎమ్మెల్యే మాధవవరం కృష్ణారావుతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో సునీతమ్మ గెలుపు పక్కా అని మాజీ కార్పొరేటర్ షఫీ ధీమా వ్యక్తం చేశారు. అక్కడ చిన్న దుకాణాలు నడుపుకొనేవారు, మార్కెట్లో కూరగాయలు అమ్ముకొనే వారు నిశ్చింతగా ఉండాలని కోరారు.