GHMC | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : ఒకవైపు అనధికారిక నిర్మాణాలను ప్రోత్సహిస్తూనే మరోవైపు హైడ్రా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం హల్చల్ చేస్తున్నది. పెద్దోడిని వదిలేసి సామాన్యుడి గుండెల్లో గునపం దింపుతున్నది. పొట్టచేత పట్టుకొని హైదరాబాద్ వచ్చి ప్రభుత్వ అసైన్డ్ స్థలాల్లో వేసుకున్న గుడిసెలను, మురుగు కాలువలు, నాలా, చెరువుల సమీపంలో కట్టుకున్న చిన్నపాటి నిర్మాణాలను కూల్చేయడంలో హైడ్రా ముందువరుసలో ఉంటున్నది. వారంతం వచ్చిందంటే చాలు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
ఒక్కో రూపాయి పోగేసి, ఈఎంఐలు చెల్లించుకుంటూ కట్టుకున్న పేదోడి సొంతింటిని అక్రమం పేరుతో హైడ్రా బుల్డోజర్లు కూల్చేస్తున్నాయి. బడాబాబుల నిర్మాణాల వైపు మాత్రం వెళ్లడం లేదు. వెళ్లినట్టే వెళ్లి బేరం కుదరగానే తిరిగొచ్చేస్తున్నాయి. బాచుపల్లిలో ఓ ప్రముఖ బిల్డర్‌కు చెందిన రెండు బ్లాకులు ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, కూల్చేస్తామని వెళ్లిన హైడ్రా బుల్డోజర్లు వెనక్కి తగ్గడం వెనుక ప్రభుత్వ పెద్దలకు భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలున్నాయి.
జంట జలాశయాల పరీవాహక ప్రాంతమైన 111 జీవో పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధుల విషయంలోనూ హైడ్రా ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. హైటెక్‌సిటీ అయ్యప్ప సొసైటీలో భారీ భవంతిని నేలమట్టం చేసిన హైడ్రా..ఆ తర్వాత సొసైటీ అక్రమ నిర్మాణదారులు కొందరు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకోగానే వెనక్కి తగ్గిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ వైపు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూనే మరోవైపు అనధికారిక నిర్మాణాల కూల్చివేతలో పక్షపాత ధోరణి ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నది.
అయప్ప సొసైటీలో 200 గజాల నుంచి వెయ్యి గజాల విస్తీర్ణంలో అపార్ట్మెంట్ల నిర్మాణం జరుగుతున్నది. సొసైటీలో అనధికారికంగా నిర్మాణాలకు వెలకట్టి మరీ స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు కప్పం వసూలు చేస్తున్నట్టు విమర్శలు వచ్చాయి. ఇక్కడ జరిగే అక్రమ నిర్మాణాలకు స్థలం, విస్తీర్ణాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తున్నారు. ఫ్లోర్‌కు రూ.1.50 లక్షల నుంచి రెండు లక్షల మేర వసూలు చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి.
కప్పం కట్టిన భవనం జోలికి ఏ అధికారీ వెళ్లరన్న చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ హయాంలో అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం మోపినా.. కొన్ని నెలలుగా విచ్చలవిడిగా పుట్టుకొస్తున్నాయి. ఈ దందా వెనుక కొందరు అధికార పెద్దలు, స్థానిక అధికారుల హస్తం ఉన్నట్టు విమర్శలున్నాయి. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలోని టాస్క్‌ఫోర్స్ బృందాలు పనిచేయకపోవడంతో గురుకుల్ ట్రస్ట్ భూములన్న అయ్యప్ప సొసైటీ, సర్వే ఆఫ్ ఇడియా లే అవుట్లో అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి.
గురుకుల్ ట్రస్ట్ భూములపై న్యాయస్థానం ఇచ్చిన స్టేటస్ కో ఉన్నా అక్రమ నిర్మాణాలు ఆగడం లేదు. వీటికి రిజిస్ట్రేషన్లు కూడా జరిగిపోతున్నాయి. జలమండలి అధికారులు నల్లా కనెక్షన్లు, విద్యుత్ అధికారులు కరెంటు కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిన్న ప్రహరీ కట్టినా ముప్పుతిప్పలు పెట్టే జీహెచ్ఎంసీ అధికారులు.. కండ్ల ముందే బడా నిర్మాణాలు జరుగుతున్నా మిగతా పట్టించుకోకపోవడం టౌన్‌ప్లానింగ్ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
మున్సిపల్ చట్టం 2019లోని సెక్షన్ 178లో పొందుపరిచిన మార్గనిర్దేశక సూత్రాలను జోనల్ కమిషనర్లు బేఖాతరు చేస్తున్నారన్న విమర్శలున్నాయి. టీఎస్ బీపాస్ చట్టంలోని 3(2)లో నియమావళి ప్రకారంగా జోనల్ పరిధిలో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలకు జోనల్ కమిషనర్ నేతృత్వం వహించాలి. జోనల్ పరిధిలో అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన బాధ్యత తీసుకోవాలి. జీహెచ్ఎంసీకి గతంలో పనిచేసిన కమిషనర్ లోకేశ్‌కుమార్ టీఎస్ బీపాస్ చట్టం-2020లోని సెక్షన్ 28(1) ద్వారా సంక్రమించిన అధికారాలు, నియమాలు జీవో 200లోని సూత్రాలను అనుసరిస్తూ జోనల్ పరిధిలోని స్పెషల్ టాస్క్‌ఫోర్స్ టీంలను, ఎన్ఫోర్స్మెంట్ బృందాలను ఏర్పాటు చేస్తూ 2020 మార్చి 3న ఆరు జోన్లకు ఆరుగురు నోడల్ అధికారులు, 24 మందితో 12 ఎన్ఫోర్స్మెంట్ బృందాలను, సర్కిళ్లలోని వార్డుల ప్రకారం 84 మంది న్యాక్ ఇంజినీర్లతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు.
ఈ టీంలు అక్రమ కట్టడాల కూల్చివేత, జరిమానాలు, సీజ్ చేయడం, పంచానామ వంటివి నిర్వర్తించాలని ఉత్తర్వులో స్పష్టం చేశారు. కానీ ఎస్టీఎఫ్ల లక్ష్యాలు పక్కదారి పట్టాయి. అవినీతికి మరిగిన కొందరి నిర్వాకం వల్ల పుట్టగొడుగుల్లా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. దీనిపై కమిషనర్ ఇలంబర్తి దృష్టి సారించి 27 మంది న్యాక్ ఇంజినీర్లపై వేటు వేశారు. అక్రమ నిర్మాణాలు ఏ స్థాయిలో వెలుస్తున్నాయో, అవినీతి ఎంత జరుగుతున్నదో చెప్పేందుకు ఈ ఉదంతమే నిదర్శనంగా నిచలింది.
కొందరి తీరుతో పట్టణ ప్రణాళికా విభాగం పూర్తిగా గాడి తప్పింది. అనుమతులు ఇచ్చి వదిలేయడంతో సదరు నిర్మాణదారులు ప్రమాదకరంగా కట్టడాలు చేపడుతున్నా కనీస బాధ్యతగా వ్యవహరించడం లేదన్న విమర్శలున్నాయి. అనుమతులు పొందిన నిర్మాణదారులు అందుకు విరుద్ధంగా సెల్లార్లు, అదనపు అంతస్తులతో చెలరేగిపోతున్నా టౌన్‌ప్లానింగ్ అడ్డుకట్ట వేయలేకపోతున్నది. ఫిర్యాదు చేసినా అధికారులపై ఒత్తిడి తెచ్చినా కేవలం నోటీసులతోనే సరిపిపెట్టి చేతులు దులుపుకొంటున్నది. ఇదే సమయంలో షోకాజ్ అందుకున్న నిర్మాణదారుడు డబ్బులిస్తే ఆ నిర్మాణ జోలికి వెళ్లడం లేదన్న ఆరోపణలున్నాయి. ఆదేమని ఆడిగితే సరైన ఎన్ఫోర్స్మెంట్ లేదని స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు చెప్తున్నారు. 16 నెలల్లో నగరంలో వేలాది అక్రమ నిర్మాణాలు పుట్టుకొచ్చాయని హైడ్రా, జీహెచ్ఎంసీ, ప్రజావాణికి వస్తున్న ఫిర్యాదులే స్పష్టం చేస్తున్నాయి.
‘ప్రణీత్ ప్రణవ్ నైట్ ఉడ్స్’ పేరుతో వెంకట ప్రణీత్ డెవలపర్స్ సంస్థ పటాన్చెరులో విల్లా చేపట్టింది. 29 ఎకరాల 23 గుంటల్లో లే అవుట్ అభివృద్ధి కోసం దరఖాస్తు చేసుకున్నది. నీటి పారుదల శాఖ నుంచి 28 ఎకరాల 3 గుంటలకు నిరభ్యంతర పత్రం వచ్చింది. మిగిలిన ఎకరంన్నర విస్తీర్ణం.. నాలా బఫర్ జోన్ అని తేల్చింది. సదరు నిర్మాణ సంస్థ మాత్రం మొత్తం విస్తీర్ణాన్ని అభివృద్ధి చేసింది. నాలాను మూడు మీటర్ల మేర, బఫర్ జోన్‌ను 9 మీటర్ల ప్రాజెక్టులో కలిపేసుకున్నది. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ ఇంజినీర్లు నివేదిక ఇవ్వగా దాని అధారంగా జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు కూల్చివేత నోటీసు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. నిర్వాహకులు మాత్రం ప్రాజెక్టును పూర్తిచేశామని, ఓసీ ఇవ్వాలని జీహెచ్ఎంసీకి దరఖాస్తు చేసుకున్నారు. దీనిని తిరస్కరించినా.. అక్రమంగా వెలిసిన విల్లా విషయంలో అటు హైడ్రా, ఇటు టౌన్ ప్లానింగ్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయి.
కూకట్‌పల్లిలోని కైత్లాపూర్ బ్రిడ్జి సమీపంలో సర్వే నంబర్ 988, 991లోని దాదాపు 2.5 ఎకరాల్లో బహుళ అంతస్తుల (నాలుగు బ్లాక్‌లలో) నిర్మాణం కోసం జీహెచ్ఎంసీకి బిల్డర్ దరఖాస్తు చేసుకున్నాడు. నిరుడు ఆగస్టులో అధికారులు అనుమతి (ఫైల్ నంబరు 003142) ఇచ్చారు. నిర్మాణ సమయంలో సదరు బిల్డర్ కూకట్పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 40 అడుగుల స్థలాన్ని అప్రోచ్ రోడ్డుగా చూపి అడ్డదారిలో అనుమతులు పొందాడు. ఏళ్ల తరబడి రోడ్డు ఉన్నదని గుడ్డిగా అనుమతిచ్చిన అధికారులు, ఇప్పుడు ఆ స్థలం హౌసింగ్ బోర్డుదేనని నిర్ధారణకు వచ్చారు.
సదరు బిల్డర్ ఐదు బ్లాక్‌లలో ఐదు ఫ్లోర్లతో యథేచ్ఛగా నిర్మాణ పనులు చేపడుతున్నాడు. హౌసింగ్ బోర్డు, టౌన్‌ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యాన్ని అసరా చేసుకొని కోర్టు నుంచి స్టే తెచ్చుకొని అటు వైపు హౌసింగ్ బోర్డు అధికారులు రాకుండా చేశాడు. టౌన్‌ప్లానింగ్ మాత్రం కూల్చివేత నోటీసులిస్తామని హడావుడి చేస్తున్నదే తప్ప..ఇప్పటి వరకు ఇచ్చిందే లేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవి మచ్చుకు మాత్రమే.. అక్రమ నిర్మాణాల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్యుడికి ఒకలా, సంపన్నులకు మరోలా చట్టాన్ని ప్రయోగిస్తున్నది.