హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ) : రేవంత్ సర్కారు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండడం లేదు. బడులను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని గొప్పగొప్ప మాటలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నది. గ్రేటర్‌లోని పాఠశాలల అభివృద్ధే ఇందుకు తాజా ఉదాహరణగా నిలుస్తున్నది. గ్రేటర్ పరిధిలో 1,346 సర్కారు బడులు ఉండగా వాటిలో వాటిలో 215 బడులకు పక్కా భవనాల్లేక అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి. అయితే ఈ బడులకు స్థలం సేకరించడం ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారింది.
అన్ని బడులను అభివృద్ధి చేస్తామని ప్రకటించి.. ఇప్పుడు మాత్రం కేవలం 40 స్కూళ్లనే తీర్చిదిద్దాలని శనివారం ప్రాథమికంగా నిర్ణయించడం ప్రభుత్వ మోసపూరిత వైఖరికి అద్దం పడుతున్నది. అంటే 2.97శాతం బడులను మాత్రమే కార్పొరేట్ బడులుగా డెవలప్ చేస్తారన్న మాట. ఈ అంశంపై స్కూళ్ల అభివృద్ధిపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లతో చర్చించిన ప్రభుత్వం అనువైన స్థలాలను కేటాయించి, వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించింది. అయితే అన్ని స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు సర్కారు వద్ద సరిపడా నిధుల్లేకే కొన్నింటికి పరిమితం చేసినట్టు తెలుస్తున్నది.
విద్యాశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 17న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్కూల్ తరహాలో తీర్చిదిద్దాలని ఆదేశించారు. తొలి దశలో ఔటర్ రింగు రోడ్డు లోపలున్న కోర్ అర్బన్ రీజియన్‌పై దృష్టి సారించాలని చెప్పారు. ఆటస్థలం, తరగతి గదులు, ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, మంచి వాతావరణముండేలా చూడాలని, ఇందుకు స్థలాలను గుర్తించాలని సూచించారు. సరైన సౌకర్యాల్లేని బడులను సమీపంలోని ప్రభుత్వ స్థలాలకు తరలించాలని చెప్పారు. నర్సరీ నుంచి నాలుగో తరగతి వరకు నూతన స్కూళ్లను పైలట్ పద్ధతిలో ప్రారంభించాలని, విద్యార్థులకు పాలు, బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజనం సమకూర్చాలని పేర్కొన్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలుచేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.
సీఎం ఆదేశాలతో సర్వే చేసిన అధికారులు ఓ యాక్షన్‌ప్లాన్ సిద్ధంచేశారు. ఓఆర్ఆర్ పరిధిలో మొత్తం 1,346 పాఠశాలలున్నాయి. వీటిలో 246 బడులు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. వీటికి పక్కా భవనాలను నిర్మించాలి. ఓఆర్ఆర్ పరిధిలో 972 ప్రాథమిక బడులున్నాయి. వీటిల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వంటి తరగతులను ప్రారంభించాలి. ఇదే బడుల్లో స్థలాలు, వసతులుంటే కాలేజీ వరకు అప్‌గ్రేడ్ చేస్తారు. 55 ప్రాథమికోన్నత బడులున్నాయి. 319 ఉన్నత పాఠశాలలున్నాయి. 1-10 తరగతి వరకు 2.34లక్షల మంది విద్యార్థులున్నారు. ఇక మొత్తంగా 1,345 బడులను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూ. 3వేల కోట్లు అవసరమవుతాయని అంచనా. అంటే ఒక్కో బడికి సగటున రూ. 2.22 కోట్లు ఖర్చుచేయాల్సి ఉంటుందన్న మాట.
ఓఆర్ఆర్ పరిధిలోని సర్కారు బడులన్నింటినీ సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు రూ.3వేల కోట్లను ప్రభుత్వ కేటాయించాలి. వాస్తవానికి ఈ నిధులను సర్కారు కేటాయించే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ నిధుల్లో కొంత మొత్తం ప్రభుత్వం సమకూరుస్తుంది. మరికొన్ని నిధులను దాతలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్ సంస్థల సీఎస్సార్ నిధులను రాబట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ నిధులెప్పుడు సమకూరాలి.. మొత్తం బడులు ఎప్పుడు పూర్తికావాలి.. అన్ని హంగులు సంతరించుకోవాలన్నది సవాల్‌గా మారింది. కార్పొరేట్ హంగుల పేరిట మాయ తప్ప.. ఇంత కన్నా మరో మోసముంటుందా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.