సీరోలు(కురవి)/బయ్యారం, డిసెంబర్ 28: యూరియా కోసం అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. రైతులకు సరిపడా బస్తాలు లేకనో, అధికారుల మధ్య సమన్వయం లేకనో పంపిణీలో గందరగోళం నెలకొన్నది. మహబూబాబాద్ జిల్లా సీరోలు మండలం కాంపల్లి గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం(సొసైటీ) వద్ద ఆదివారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఒక రైతుకు ఒకే బస్తా ఇస్తుండడంతో రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. అదుపుచేసేవారు లేకపోవడంతో యూరియా దొరుకుతుందో లేదోనన్న ఆందోళనతో రైతుల మధ్య తోపులాట జరిగింది.
ఒకరినొకరు నెట్టేసుకోవడంతో తోపులాట జరిగి స్వల్పంగా ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న సీరోలు ఎస్సై సంతోష్ సిబ్బందిని అకడికి పంపించడంతో రైతులు శాంతించారు. సొసైటీకి 666 బస్తాలు రాగా, ఒక రైతుకు ఒక బస్తా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి, మకజొన్న సాగుకు ఒక బస్తా యూరియా ఎలా సరిపోతుందని పలువురు రైతులు అధికారులు నిలదీశారు. పది ఎకరాలున్న రైతుకు, ఎకరం ఉన్న రైతును ఒకేలా చూస్తే ఎలా అని ప్రశ్నించారు.
కురవి సొసైటీలో 1332 యూరియా బస్తాలు, నేరడలో 666 బస్తాలు, గుండ్రాతిమడుగు(విలేజ్) సొసైటీలో 666 యూరియా బస్తాలను రైతులకు అందజేసినట్లు కురవి మండల వ్యవసాయాధికారి నర్సింహారావు తెలిపారు. బయ్యారం మండల కేంద్రంలోని రైతు వేదికలో అధికారులు ఆదివారం యూరియా పంపిణీ చేశారు. అయితే గత కొన్ని రోజులుగా కార్డుల ద్వారా యూరియా పంపిణీ చేసిన అధికారులు.., ఆదివారం లిస్ట్ ద్వారా పంపిణీ చేస్తామని చెప్పడంతో గందరగోళం నెలకొంది. కొందరు లిస్ట్ ద్వారా, మరికొందరు కార్డు సిస్టం ద్వారా పంపిణీ చేయాలని పట్టుబట్టడంతో ఇరువర్గాల రైతుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం అధికారులు లిస్ట్ ద్వారా యూరి యా పంపిణీ చేశారు.