మేడ్చల్, డిసెంబర్29 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడిచినా భూ క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉన్న వారికి నిబంధనల మేరకు భూ క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో వంద గజాలలోపు వారికి 58 జీవో కింద ఎలాంటి ఫీజులు లేకుండా వంద గజాల పైబడి ఉన్న వారికి 59 జీవో కింద దరఖాస్తులు చేసుకున్న విషయం విదితమే.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల నుంచి 58 జీవో కింద 28,082 దరఖాస్తులు, 59 జీవో కింద 15,200 దరఖాస్తులు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న సమయంలో 58 జీవో కింద వచ్చిన దరఖాస్తులలో నిబంధనల మేరకు ఉన్న కొన్నింటిని పరిష్కరించి క్రమబద్ధీకరించగా 59 జీవోలో భూక్రమబద్ధీకరించే క్రమం లో అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో వీలు లేకుండా పోయింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు భూ క్రమబద్ధీకరణ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో దరఖాస్తుదారులు ఆవేదన చెందుతున్నారు.
59 జీవో కింద క్రమబద్ధీకరణకు నిబంధనల మేరకు ఉన్న వాటికి ఫీజులు చెల్లించిన వాటికి క్రమబద్ధీకరణ చేసేందుకు ఇండ్ల యజమానులకు నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. నోటీసులు ఇచ్చిన వారు సుమారు రూ. 3 కోట్ల పైచిలుకు ఫీజులు ప్రభుత్వానికి చెల్లించినట్లు అధికారుల ద్వారా తెలిసింది. అయితే ఫీజులు చెల్లించిన వారికి ఇప్పటి వరకు క్రమబద్ధీకరణపై వారికి ఎలాంటి సమచారం లేదని ఆవేదన చెందుతున్నారు.
ఈ విషయమై అధికారుల దృష్టికి తీసుకువెళితే ప్రభుత్వం క్రమబద్దీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు దరఖాస్తుదారులకు చెప్పి పంపుతున్నారు. దీంతో అసలు భూ క్రమబద్ధీకరణ చేస్తారా చెయ్యారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.