అమీర్పేట : బీఆర్ఎస్ మాజీ మంత్రి , సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav )శనివారం అమీర్పేట ( Ameerpeta ) డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యల గోడును విన్నవించుకున్నారు. తమకు తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ఏనాడు త్రాగునీటి ఇబ్బందులు ఏర్పడలేదని పేర్కొన్నారు. ప్రజల నిత్య అవసరాలను తీర్చుకోవడానికి నీరు తప్పనిసరని అలాంటిది నెలన్నర రోజులుగా డివిజన్ వాసులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారని వెల్లడించారు.
ప్రజల నల్లాలకు సరఫరా చేయడానికి లేని నీరు ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేందుకు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నగర ప్రజలకు నీరు సరఫరా చేయలేమని ముఖ్యమంత్రి ప్రకటించి తమ అసమర్ధతను వెల్లడించాలని డిమాండ్ చేశారు.