సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఉచిత మంచినీరు.. సామాన్యుడి హక్కు. కానీ కాంగ్రెస్ సర్కారు ఆ హక్కును సైతం కాలరాస్తున్నది. కేసీఆర్ ప్రభుత్వం మానవీయ కోణంలో అమలులోకి తెచ్చిన నిరుపేదలకు 20కేఎల్ ఉచిత మంచినీటి పథకానికి రేవంత్ ప్రభుత్వం నీళ్లొదులుతున్నది. వాస్తవానికి హైదరాబాద్ మహా నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థను నిర్వహిస్తున్న జలమండలి ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. ఈ నేపథ్యంలో బోర్డుపై భారం లేకుండా కేసీఆర్ ప్రభుత్వమే ఏటా రూ.300 కోట్లను ఈ పథకానికి అందిస్తూ వస్తుంది.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం గతేడాది బడ్జెట్లో రూ.300 కోట్లు ఈ పథకానికి కేటాయించి నిధులు మాత్రం విడుదల చేయకపోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నగరంలోని దాదాపు 8లక్షల మందికిపైగా నిరుపేద కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చే ఇలాంటి పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను ప్రదర్శించింది. ఇదిలా ఉంటే తాజా బడ్జెట్ కేటాయింపుల్లో జలమండలికి గత సంవత్సరం కేటాయించిన అంకెలనే ఈసారి బడ్జెట్లోనూ పొందుపరిచారు. కానీ గడిచిన సంవత్సరకాలంగా ఇందులో పావు వంతు కూడా నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం.
హైదరాబాద్ మహా నగరంలో అత్యంత కీలకమైన తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థను నిర్వహించే జలమండలికి ప్రభుత్వం రూ.3,385 కోట్ల కేటాయింపులను చేపట్టింది. ఇందులో జలమండలి గతంలో మంచినీటి పథకాలకు తీసుకున్న రుణాల చెల్లింపులకే సింహభాగం కేటాయింపులు ఉన్నాయి. పలు పద్దుల కింద వీటి కేటాయింపులను చూపారు. వివిధ అభివృద్ధి పనుల కోసమంటూ రూ.1450 కోట్లు, సుంకిశాల పథకం రుణాల చెల్లింపునకు రూ.1000 కోట్లు, మరో పద్దు కింద రుణాల చెల్లింపునకు రూ.635 కోట్లు కేటాయించింది.
నిరుపేదలకు 20వేల లీటర్ల వరకు ఉచిత తాగునీటి పథకానికి రూ. 300 కోట్లు కేటాయింపులు చేశారు. అయితే గత ఏడాది నుంచి ఇప్పటివరకు జలమండలిపై రూ.1850 కోట్ల రుణాల భారం ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం గోదావరి జలాల తరలింపు 2-3 దశల పథకానికి టెండర్లు పిలిచింది. రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్న ఈ పథకం కోసం జలమండలి ఏకంగా రూ.2,650 కోట్ల రుణాన్ని హడ్కో నుంచి తీసుకుంటున్నది. ఈ క్రమంలో పథకం పనులను త్వరలోనే ప్రారంభిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. ప్రత్యేకంగా ఈ పథకానికి కేటాయింపులు చేయలేదు.
పైగా ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న బోర్డుపై రుణ భారం కూడా పెరిగి ఆ మొత్తం రూ.4వేల కోట్లకు పైగా చేరుకోనుంది. నానాటికీ నగరం విస్తరించడంతో పాటు కొత్త నిర్మాణాలు, జనాభా పెరుగుదల కోణంలోనూ బోర్డు నిర్వహణ, సేవలపై భారం పెరగనున్నది. దీంతో పాటు ప్రధాన నగరంలో డ్రైనేజీ వ్యవస్థ శిథిలావస్థకు చేరుకున్న దరిమిలా కొత్త పైపులైన్లు, మంజీరా, జంట జలాశయాలకు సంబంధించి కొత్త పైపులైన్లు వేయాల్సిన అనివార్యత ఉంది. ఈ వ్యవస్థలో భారీ లీకేజీల కారణంగా తరచూ సరఫరాలో అంతరాయంతో పాటు నీటి పరిమాణంలో కోత పడుతుంది.
కొసమెరుపు: అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో చరిత్రలో ఎన్నడూలేని విధంగా నగరంలోని మ్యాన్‌హోళ్లను ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ‘గత కొన్ని దశాబ్దాలకాలంగా ఎప్పుడూ పట్టించుకోని మ్యాన్‌హోల్స్ పనులు, ఒక స్పెషల్ డ్రైవ్‌గా జలమండలి చేపట్టింది. 3,025 కి.మీ. మురుగునీటి లైన్లు శుభ్రం చేసి 2.39 లక్షల మ్యాన్‌హోల్స్ పూడికతీత ప్తూర్తయింది.
ఫలితంగా ఇప్పటివరకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు 25 శాతానికి పైగా తగ్గాయి’ అని పేర్కొన్నారు. వాస్తవానికి నిజాం కాలం నుంచి డ్రైనేజీ వ్యవస్థలోని మ్యాన్‌హోళ్ల పూడికతీత అనేది కొనసాగుతుంది. నిర్ణీత కాలంలో పూడిక తీయకపోతే ఆ మ్యాన్‌హోల్ పొంగుతుంది. అందుకే మ్యాన్‌హోళ్ల పూడికతీత అనేది సాధారణంగా చేపట్టే ఒక ప్రక్రియ. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 2.39 లక్షల మ్యాన్‌హోళ్లలో పూడిక తీశామని భట్టి చెప్పడమంటే.. పదేండ్లు మ్యాన్‌హోళ్లలో పూడిక తీయకుంటే మురుగు ఎలా పారింది? అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికే తెలియాలి.
సికింద్రాబాద్,మార్చి19: కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి నిరాశను మిగిల్చే బడ్జెట్ ప్రవేశపెట్టింది . సంక్షేమం, అభివృద్ధికి పూర్తిగా తిలోదకాలు పలకడంతో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను విస్మరించింది. పింఛన్ల పెంపు, కళ్యాణ లక్ష్మికి అదనంగా తులం బంగారం, రూ.2500 చొప్పున మహా లక్ష్మి పథకం, నిరుద్యోగ భృతి వంటి ఏ హామీలకు నిధులు కేటాయించ లేదు.
బడంగ్ పేట్, మార్చి 19: అబద్దాల పునాదుల మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమం ఊసే లేదు. ఇచ్చిన హామీల ఆచూకీ లేదు. ఆరు గ్యారంటీల ప్రస్తావన బడ్జెట్లో లేదు. గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయడం, కేసీఆర్‌ను తిట్టడంతోనే రేవంత్ రెడ్డికి కాలం గడిచిపోతుంది. రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని అందులో సగం కూడా చేయలేదు. మహిళలకు ఇస్తామన్న తులం బంగారం గురించి ప్రస్తావన లేదు.
మల్కాజిగిరి, మార్చి 19: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ నగర ప్రజలు ఆశించినంతగా లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో వాగ్దానాలతో ఊదరగొట్టింది. చెప్పిందొకటి చేస్తున్నదొకటని కాంగ్రెస్ పార్టీ తీరేవేరయ అని ప్రజలు అంటున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చడానికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదు, రానున్న ఎండకాలంలో ప్రజల గొంతు ఆరేటట్టు ఉంది. నీటి కోసం పానిపట్టు యుద్ధాలు జరిగే విధంగా బడ్జెట్ ఉంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్‌కు నిధులు బడ్జెట్లో కేటాయించ లేదు.
జూబ్లీహిల్స్ : గత ఏడాది బడ్జెట్లో కేటాయించిన నిధులను ఖర్చు చేయకుండా నోటికి వచ్చిన లెక్కలతో కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలు అంటూ నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన పూర్తి చేసుకుంది. ఇప్పటికీ గ్యారంటీలు అమలు చేయడం లేదు. మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం లాంటి పథకాల విషయంపై బడ్జెట్లో లేదు. హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం గత బడ్జెట్లో ప్రకటించిన నిధుల్లో ఎన్ని ఖర్చు చేశారో తెలియదు. తప్పుడు నిర్ణయాలతో హైదరాబాద్ అభివృద్ధిని కుప్పకూల్చారు. నిర్మాణరంగంతో పాటు అన్ని రంగాల కార్మికులు ఉపాధి లేక రోడ్డున పడ్డారు. వారి సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో బడ్జెట్ లో చెప్పలేదు.
ఎల్బీనగర్, మార్చి 19: అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను మోసం చేసే విధంగా ఉంది. గత ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రగతిని బడ్జెట్ ద్వారా పరుగులు పెట్టిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండుసార్లు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడి మాత్రమే చేసింది.మహాలక్ష్మి పథకంలో భాగంగా చెప్పిన ఆరు గారంటీల్లో ఏ ఒక్కటి సరిగా అమలైన దాఖలాలు లేవు. పెన్షన్ల పెంపు, నిరుద్యోగ భృతి, విదేశీ విద్య, మహిళలకు 2500 వంటి వాటి ఊసే బడ్జెట్లో లేకపోవడం ఆశ్చర్యకరం. హైదరాబాదులో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధి లేనందున హైదరాబాద్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినట్లు తెలుస్తుంది. మెట్రో రైలుపై గతంలో సీఎం హామీ ఇచ్చి ఈ బడ్జెట్ లు మాత్రం మెట్రో రైల్ ను విస్మరించడం స్పష్టంగా కనిపిస్తోంది.
దుండిగల్, మార్చి 19: విశ్వ నగరాభివృద్ధిని బడ్జెట్ లో పూర్తిగా విస్మరించారు. బుధవారం ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్లో మహానగరాభివృద్ధిపై దృష్టి సారించకపోవడంపై బాధాకరం. మహానగరాన్ని నలుమూలల అనుసంధానం చేస్తూ ఎంతోమంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చే హైదరాబాద్ మెట్రో కు బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. తెలంగాణను పూర్తి ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా మార్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శంకుస్థాపన చేసిన మల్టీస్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు బడ్జెట్ లో నిధులు కేటాయించలేదు. దీంతో నిరుపేదలకు అందాల్సిన మెరుగైన వైద్యం మరింత ఆలస్యం కానుంది.
ముషీరాబాద్, మార్చి19 : బడ్జెట్ పేద ప్రజల కష్టాలు తీర్చేదిలేదు. అరకొర కేటాయింపులతో ప్రజలకు దక్కేది గుండు సున్న. ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు, ఆరు గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం పలికారు. ఆటో డ్రైవర్ మొదలుకొని అన్నదాత వరకు అందరినీ వంచించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మహిళలు, వృద్ధులకు ఇచ్చిన హామీల గురించి బడ్జెట్ లో ప్రస్తావించలేదు. తులం బంగారం దిక్కు లేదు. చేనేత రంగానికి బీఆర్ఎస్ హయాలో 1200 కోట్ల రూపాయిలు కేటాయిస్తే, నేడు చేనేత కార్మికులకు 300 కోట్లకే పరిమితం చేశారు.
ఉప్పల్, మార్చి 19 : నగరానికి అరకొర బడ్జెట్లు కేటాయించడం శోచనీయం . గత ప్రభుత్వం కేటాయించిన నిధులతోనే నగర అభివృద్ధి జరిగింది. దేశానికే తలమానికంగా ఉన్న నగరానికి నిధుల్లో సరైన కేటాయింపులు జరగకపోవడం సరికాదు. ప్రభుత్వ పనితీరు సరిగా లేకపోవడంతోనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. రేవంత్ రెడ్డి వాగ్దానాలు ఆకాశంలో ఉంటే, ప్రతిపాదనలు మాత్రం పాతాళంలో ఈ బడ్జెట్ చూస్తే అనిపిస్తుంది. గత బడ్జెట్లో చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఉన్న ప్రతిపాదనల పరిస్థితి కూడా అంతే. రేవంత్ రెడ్డి బుద్ది మాంద్యం వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోతోంది.
అంబర్‌పేట, మార్చి19 రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపారు. ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం చూస్తే రాజకీయ ప్రసంగం లాగా ఉంది. అందులో పచ్చి అబద్దాలు, అసత్యాలు చెప్పారు. ఎన్నికల ముందు అన్నీ చేస్తామని, అధికారంలోకి వచ్చాక ఏమీ చేయలేమనేలా ఈ బడ్జెట్ ఉంద 72 పేజీల బడ్జెట్లో పేదల సంక్షేమం కోసం నిధులేమీ పెంచలేదని తెలిపారు.
కేపీహెచ్‌బీ కాలనీ, మార్చి 19: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీలా కనిపిస్తుంది. ప్రభుత్వం రైతాంగానికి చేయూతను అందించేందుకు మహిళలకు అండగా నిలిచేందుకు బడ్జెట్లో కేటాయింపులు లేవు. కళ్యాణ లక్ష్మి షాదీముబారక్ పథకాలకు తులం బంగారం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదు. దళిత బంధు బీసీ బంధు లాంటి పథకాల ఊసు లేకుండా పోయింది. ప్రజలను మభ్య పెడుతూ ప్రభుత్వం పాలన సాగిస్తుంది. ఈ బడ్జెట్ తో ఎవరికి మేలు జరగదు. అంతా అంకెలగారడిగా మార్చి గొప్పగా ఉందని చెప్పడం బాధాకరం.
కంటోన్మెంట్, మార్చి 19: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీతో పాటు ప్రజలను మోసం చేసే విధంగా విధంగా ఉందని కంటోన్మెంట్ కు చెందిన బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హామీలను గాలికి వదిలేసి, జనాలను మభ్యపెట్టే బడ్జెట్ ను ప్రవేశపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేసిందని దుయ్యబట్టారు. బడ్జెట్ పై బీఆర్ఎస్ నేతల అభిప్రాయాలు..
అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్ చూస్తే హామీల ఎగవేతల బడ్జెట్ లా ఉందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఇది మొండి చేయి ఇచ్చే బడ్జెట్.. గొప్పలు చెప్పుకొనే బడ్జెట్.. కేవలం 36 వేల కోట్లతో అభివృద్ధి ఎలా సాధ్యమో భట్టి విక్రమార్క చెప్పాలన్నారు. ఈ రాష్ర్టాన్ని దివాలా తీసేలా పెట్టారు అని మండిపడ్డారు. ఆదాయం చరానా.. అప్పు బరానా అన్నట్లు ఉంది.. బడ్జెట్ నిండా అప్పులే ఉన్నాయి.. రాష్ట్ర అప్పులు మరింత పెరిగే సూచికగా ఉంది..
– మన్నే క్రిశాంక్, మాజీ చైర్మన్, రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తీరును విశ్లేషిస్తే ఆరు గ్యారంటీల అమలుకు పంగనామాలు పెట్టారు. ముఖ్యంగా గత బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులను పరిశీలిస్తే పొంతనే లేదని, అయినప్పటికీ బడ్జెట్ కేటాయింపులు పెంచి రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేసేందుకు బడ్జెట్‌ను సాధనంగా చేసుకోవడం సిగ్గు చేటని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి అన్నారు. మహిళలకు రూ.2,500, తులం బంగారం, స్కూటీ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గత బడ్జెట్ లోనూ, ఈ బడ్జెట్లోనూ నయాపైసా కేటాయించలేదన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భ్రుతిపై బడ్జెట్లో కేటాయింపులు జరపకపోవడం సిగ్గు చేటు అని తెలిపారు.
– జక్కుల మహేశ్వర్ రెడ్డి , మాజీ ఉపాధ్యక్షులు, కంటోన్మెంట్ బోర్డు
రేవంత్ సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జెల నాగేష్ మండిపడ్డారు. బడ్జెట్ ప్రసంగంలో భట్టి అన్నీ అబద్దాలు చెప్పారని దుయ్యబట్టారు. మహిళా సంఘాలకు లక్ష కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారని, కేవలం రూ.5 లక్షల రుణాలు మాత్రమే వడ్డీ లేకుండా ఇచ్చారని మిగతా ఋణాలకు 12 శాతం వడ్డీలు కడుతున్నారని అన్నారు. రూ.4000 ఇస్తామన్న పెన్షన్లు ఊసే లేదని, కొత్తగా ఎవ్వరికీ ఇవ్వలేదని, ఉన్నవే తొలగించారని అన్నారు. రాష్ట్రంలో ఆడపడుచులకు రూ.2500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారని, ఆ పథకం గురించి మర్చిపోయి అందాల పోటీలకు మాత్రం రూ.250 కోట్లు కేటాయించారని విమర్శించారు.
– గజ్జెల నాగేష్, మాజీ చైర్మన్, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్