సిటీ బ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని విచ్చలవిడిగా ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నది. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల అధికారులు, పోలీసులను తమ గుప్పిట్లో పెట్టుకుని ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ప్రార్థన మందిరాలైన మసీదులు, చర్చిల్లోకి ప్రవేశించి ఉప ఎన్నిక ప్రచారం చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు కండ్లప్పగించి చూస్తున్నారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు పాల్పడ్డ కాంగ్రెస్ నేతలపై చర్యలు తీసుకోవాల్సిన ఎలక్షన్ కమిషన్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నది.
బీఆర్ఎస్ దూకుడుకు ఓటమి భయం పట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఎక్కడికక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు. మద్యం, డబ్బు, చీరలు, కుక్కర్ల వంటి తాయిలాలు బహిరంగంగానే పంచుతున్నారు. మరికొన్ని చోట్ల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్‌కు ఓటేయకుంటే పథకాలు కట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. బీఆర్ఎస్ సహా స్వతంత్ర అభ్యర్థుల ప్రచారాన్ని అడ్డుకుంటూ గూండాగిరి చేస్తున్నారు. ఇదంతా తమ కండ్ల ముందే జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు వారికి మద్దతు పలుకుతున్నారు. కాంగ్రెస్ ఎన్నికల నియమావళి ఉల్లంఘనలపై బీఆర్ఎస్ ఎన్ని ఫిర్యాదులు చేసినా ఎలక్షన్ కమిషన్ మొద్దు నిద్ర వీడటం లేదు.
ఎన్నికల నియమావళి ప్రకారం మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో ఎన్నికల ప్రచారాలు చేయడం నిషిద్ధం. ప్రచారాలు చేసి భక్తులను ప్రలోభాలకు గురిచేస్తే నిబంధనల ఉల్లంఘనల కింద శిక్షార్హులు అవుతారు. కానీ కాంగ్రెస్‌కు అవేమీ వర్తించవన్నట్లుగా ఆ పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మసీదుల లోపలికి వెళ్లి ముస్లిం ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారు. వారికి పోలీసులే బందోబస్తుగా ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ ఓ మసీదులోకి వెళ్లి కాంగ్రెస్‌కు ఓటేయాలంటూ ప్రసంగించారు. వార్తా ప్రతికల్లో రావడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయినా ఎన్నికల అధికారులు చూసీ చూడనట్లు వదిలేశారు. ఆదివారం మంత్రి దామోదర రాజనర్సింహ, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఎర్రగడ్డలోని ప్రేమ్‌నగర్ కింగ్ గొస్పెల్ చర్చిలో ప్రచారం నిర్వహించారు. క్రైస్తవ భక్తులను ప్రలోభాలకు గురిచేసేలా ప్రసంగించారు. ఇలా నియోజకవర్గ వ్యాప్తంగా అనేక ఘటనలు జరుగుతున్నా ఎనికల కమిషన్ వేడుక చూస్తున్నది. ఎన్నికల సంఘం అన్ని పార్టీలను సమానంగా చూడకుండా.. కాంగ్రెస్ పార్టీకి కొమ్ముకాస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నవీన్ యాదవ్ అనుచరులు, బయటి నుంచి వచ్చిన రౌడీ మూకలు బీఆర్ఎస్ కార్యకర్తల ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకున్నారు. బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేయొద్దని బెదిరింపులకు పాల్పడ్డారు. కొంతమంది కార్యకర్తలను ఇక్కడికి రావొద్దంటూ హుకుం జారీ చేశారు. కాంగ్రెస్ మోసాలకు బలైన నిరుద్యోగులు, రైతులు, కుల సంఘాలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రచారాలు ర్యాలీలను ఎక్కడికక్కడ నవీన్ అనుచరులు అడ్డుకున్నారు. వారిని బూతులు తిడుతూ వేధింపులకు గురి చేశారు.
వీటిపై పోలీసులు, ఎన్నికల కమిషన్‌కు బీఆర్ఎస్ నేతలు ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. కనీసం విచారణ కూడా చేపట్టలేదు. కేసులు నమోదు చేయలేదని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు ఎన్నికల కమిషన్, పోలీసు విభాగాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా నవీన్ యాదవ్ అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు నిబంధనలు ఉల్లంఘిస్తూ బెదిరింపులకు పాల్పడ్డారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డా కనీసం పట్టించుకోలేదని మండిపడుతున్నారు.