మేడ్చల్ రూరల్, జనవరి 13: హామీల అమల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ప్రజాపాలన పేరుతో పబ్బం గడుపుకొంటూ మోసం చేసిన ఆ పార్టీ పతనం ఖాయమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు బాల్‌రాజ్ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే మల్లారెడ్డి సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మల్లారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో పదేండ్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్న ప్రజలకు..ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో తాగునీరు కూడా దొరకని పరిస్థితి ఉందని అన్నారు. కేసీఆర్‌పై నమ్మకంతో గ్రామాల్లో అనేకమంది బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎల్లంపేట మున్సిపల్ పై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని మల్లారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో శంకర్, కొండల్‌రెడ్డి, సాయి, సంతోష్, యాదయ్య, బాలకృష్ష, శ్రావణ్ తోపాటు 50 మంది నాయకులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షుడు భాస్కర్ యాదవ్, ప్రధాన కార్యదర్శి దర్శన్, నాయకులు.. శ్రీనివాస్‌రెడ్డి, రాజమల్లారెడ్డి, జగన్‌రెడ్డి, నవీన్‌రెడ్డి, రాజ్‌కుమార్, సుశాంత్‌రెడ్డి, సురేందర్, బాల్‌రెడ్డి, దాది శంకర్, రంగారెడ్డి, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.