సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్: ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ గెజిటెట్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది. ఈమేరకు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్వో వెంకటాచారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరిస్తామని మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు.
మొత్తం 63 డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను కలెక్టర్ కార్యాలయానికి నోటీసు రూపంలో అందజేశామన్నారు. ప్రధానంగా ఐదు పెండింగ్ డీఏలు విడుదల,ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని(ఈహెచ్ఎస్)అమలు,నెలకు రూ.700 కోట్ల మేర ఉన్న పెండింగ్ బిల్లుల క్లియర్,సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు, యూనిఫైడ్ సర్వీస్ రూల్స్ తక్షణమే అమలు, కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 57 ప్రకారం డీఎస్సీ ద్వారా నియమితులైన టీచర్లకు పాత పెన్షన్ స్కీం అమలు,51 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే అమలు,వివిధ కారణాలతో సస్పెండ్ అయిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని,
భాగ్యనగర్ తెలంగాణ ఎన్జీవోలకు గచ్చిబౌలి హౌసింగ్ స్థలాన్ని కేటాయించాలని,జీవో నెంబర్ 317 ద్వారా నష్టపోయిన ఉద్యోగులకు న్యాయం చేయడం,వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న ప్రమోషన్లను వెంటనే పూర్తి చేయడం,నూతనంగా ఏర్పడిన మండలాల్లో ఎంఈవో పోస్టుల మంజూరు, 29 రోజుల సమ్మెలో పాల్గొన్న ఎస్ఎస్ఏ ఉద్యోగు లకు జీతాలను మంజూరు చేయడం, సెప్టెంబర్ 1వ తేదీని పెన్షన్ ద్రోహ దినోత్సవంగా పాటించడం వంటి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకురావ డానికి జేఏసీ ప్రణాళికను సిద్ధం చేసిందని వారు అన్నారు. సెప్టెంబర్ 1వ తేదీన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు కోసం భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు.
తమ సమస్యలన్నింటిని పరిష్కరించాలని కోరారు. లేదంటే అన్ని జిల్లాల జేఏసీ నేతలతో చర్చించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ హైదరాబాద్ జిల్లా చైర్మన్ విక్రమ్ కుమార్, కన్వీనర్ ఎంబీ కృష్ణ యాదవ్, టీఎన్జీవో కార్యదర్శి శ్రీనివాస్, టీజీవో కార్యదర్శి ఖాదర్, కేంద సంఘం నాయకులు కోటాజి, హైదరాబాద్ జేఏసీ నాయకులు నర్సింగరావు, ఆశన్న, శ్రీరాములు, రాజేందర్, వెంకటరమణారెడ్డి, రవికుమార్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.