మేడ్చల్, జనవరి 23 (నమస్తే తెలంగాణ): గ్యారంటీల అమల్లో లబ్ధిదారుల ఎంపికపై రీ సర్వే చేయాల్సిందేనని దరఖాస్తుదారుల నుంచి డిమాండ్లు వస్తున్నాయి. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల జారీ లబ్ధిదారుల ఎంపికలో అనేక అవకతవకలు జరిగిన నేపథ్యంలో దరఖాస్తుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వేలు చేయకుండా కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి మేరకే లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు ఆరోపిస్తూ మళ్లీ లబ్ధిదారుల ఎంపికపై రీ సర్వేను చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తుదారులు అధికారులను నిలదీస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన గ్రామ, వార్డు సభల్లో లబ్ధిదారుల ఎంపికపై అధికారుల తీరుపై నిరసనలు, నిలదీతలు జరిగాయి. ప్రభుత్వం నుంచి పథకాల ఎంపికపై స్పష్టత లేకపోవడంతో అధికారులకు తలనొప్పిగా మారింది.
లబ్ధిదారుల జాబితానా లేక..?
మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలో జరుగుతున్న గ్రామ, వార్డు సభల్లో అధికారులు చదువుతుంది లబ్ధిదారుల ఎంపిక జాబితానా, దరఖాస్తుల జాబితానా అన్నది స్పష్టంగా అధికారులు దరఖాస్తుదారులకు చెప్పలేకపోతున్నారు. ఈ నెల 22న జరిగిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌లో స్వయంగా మంత్రులు గ్రామ, వార్డు సభల్లో చదివే జాబితా దరఖాస్తుదారులదేనని, లబ్ధిదారుల జాబితా కాదని, జాబితాలో పేర్లు లేని వారి నుంచి మళ్లీ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించాలని కలెక్టర్లకు మంత్రులు సూచించిన విషయం తెలిసిందే. ఈ విషయమై అధికారులు జరుగుతున్న గ్రామ, వార్డు సభల్లో దరఖాస్తుదారులు ఇది లబ్ధిదారుల జాబితానా, దరఖాస్తుదారుల జాబితానా అని అధికారులను ప్రశ్నిస్తున్నా.. సరైన సమాధానాలు చెప్పలేకపోతున్నారు. దరఖాస్తుదారులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పలేకపోతుండటంతో మరింత ఆగ్రహానికి గురవుతున్నారు. ప్రజాపాలనలో స్వీకరించిన దరఖాస్తుల్లో నామ మాత్రంగా లబ్ధిదారులను ఎంపిక చేసి మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తుండటంతో పథకాల అమలును పొడగించేందుకే ప్రభుత్వం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వేలాది సంఖ్యలో దరఖాస్తులు
జిల్లాలోని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో జరుగుతున్న గ్రామ, వార్డు సభల్లో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల కోసం వేలాది సంఖ్యలో మళ్లీ దరఖాస్తులు చేసుకుంటున్నారు. దీంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
రాంచంద్రగూడ గ్రామ సభలో ఉద్రిక్తత
బడంగ్‌పేట: రామ చంద్రగూడ గ్రామంలో గురువారం నిర్వహించిన సభలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు నిజమైన లబ్ధిదారులకు ఎందుకు రాలేదని బీఆర్ఎస్ మహేశ్వరం అధ్యక్షుడు రాజునాయక్, స్థానికులు అధికారులను నిలదీశారు. కాంగ్రెస్ నేత కృష్ణ నాయక్ ‘మా పాలన మా ఇష్టం.. మీరెవరు చెప్పడానికి’ అని అనడంతో లొల్లి మొదలైంది. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నేతలపై దాడికి యత్నించారు. దీంతో గ్రామసభ రణరంగంగా మారింది. ‘ఇది బీఆర్ఎస్ పాలన కాదు.. కాంగ్రెస్ పాలనలో మా ఇష్టం వచ్చిన వాళ్లకే పథకాలు వస్తాయి..’ అని బాహాటకంగానే కాంగ్రెస్ నాయకులు అనడంతో స్థానికులు ఒక్కసారిగా గ్రామ సభలో ఉన్న అధికారుల తీరుపై మండి పడ్డారు.ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు ఉన్న వారికే ఎలా ఇస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.