వనస్థలిపురం, అక్టోబర్ 29 : రిజిస్ట్రేషన్ సమస్య పరిష్కరించేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో తీసుకొచ్చిందని, దానిని అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం బీఎన్‌రెడ్డినగర్‌లో 118 జీవో పరిధిలోని కాలనీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. కేటీఆర్, కేసీఆర్ సహకారంతో ఎల్బీనగర్ నియోజకవర్గం కోసమే 118 జీవో తీసుకొచ్చామన్నారు. దానిని పూర్తి స్థాయిలో అమలు చేసి, అందరికీ కన్వీనియన్స్ డీడ్ ఇప్పించేందుకు కృషి చేస్తున్న సమయంలో ఎన్నికలు వచ్చాయని తెలిపారు. కొత్త ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా ఆపివేసిందన్నారు.
కలెక్టర్, సీసీఎల్ఏతో దీనిపై మాట్లాడుతున్నానని, సీఎం ఆదేశాలుంటేనే తాము ఏదైనా చేయగలమని అధికారులు చెబుతున్నారన్నారు. విషయంపై అవగాహన లేని మధుయాష్కీ అడ్డగోలుగా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. నిజామాబాద్ ప్రజలు తరిమితే ఇక్కడికి వచ్చాడన్నారు. ప్రభుత్వంతో పని చేయించుకోలేని దద్దమ్మ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇప్పిస్తున్నాడని, దాన్ని త్వరలోనే బయటపెడతామన్నారు. కాలనీ సంక్షేమ సంఘాలతో కలిసి త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని సమస్య పరిష్కరించే బాధ్యత తనదేనన్నారు. బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు, సతీశ్ గౌడ్, శివశంకర్, కాలనీల ప్రతినిధులు పుల్లారెడ్డి, రాంబాబు, పురుషోత్తం రెడ్డి, దామోదర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ఆర్.ముత్యం రావు, రవీందర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, అమరేందర్ రెడ్డి పాల్గొన్నారు.