‘కాంగ్రెస్ పాలనలో మా పరిస్థితి అధ్వానంగా ఉండే.. కరెంటు సరిగ్గా ఉండక ఎవుసం ఆగమైతుండే. రాత్రి పూట ఇచ్చే రెండు మూడు గంటల కరెంట్‌కు పొలాల వద్ద జాగారం చేసేవాళ్లం. అప్పట్ల అనుభవించిన కష్టాలు ఇంకా కండ్ల ముందు కదలాడుతున్నాయి. కాంగ్రెసోళ్ల మాటలు వింటుంటే రైతులను ఆగం చేసే కుట్రలు పన్నుతున్నట్టు అనిపిస్తున్నది. రైతులు బాగుపడడం ఆ పార్టీకి ఇష్టముండదు. ధరణిని రద్దు చేస్తామని, మూడు గంటలే కరెంటు ఇస్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.
మూడు గంటల కరెంటుతో నారుమళ్లు కూడా తడవవు. భూమేతకోసమే..ధరణిని తీసేస్తామంటున్నారు’ అని మండిపడుతున్నారు అన్నదాతలు. రైతును రాజులా మార్చింది కేసీఆర్ ప్రభుత్వమని.. 24 గంటల కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ధరణి వంటి వాటితో సంబురంగా బతుకుతున్నామని చెప్పారు. పొరపాటున కూడా కాంగ్రెస్‌కు ఓటేయ్యమని.. మళ్లీ ఆ చీకటి రోజులు మాకొద్దని ముక్తకంఠంతో చెబుతున్నారు. మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్కే మా సంపూర్ణ మద్దతు అని స్పష్టం చేస్తున్నారు.
ధరణితో సమస్యలు తీరాయి
రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్‌తో పాటు ధరణి వంటితో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగానికి ఎంతో మేలు చేస్తున్నది. ధరణి వచ్చిన తర్వాత రైతులకు రికార్డుల సమస్య తీరిపోయింది. ఒక్కరోజులోనే రిజిస్టేషన్, మ్యూటేషన్ జరిగిపోతున్నాయి. ఆన్లైన్ రికార్డులతో పాటు నెల రోజుల్లోపే పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇంటికి వస్తున్నాయి. రైతాంగం కోసం ప్రభుత్వం తెచ్చిన రైతుబంధు కావచ్చు.. రైతుబీమా కావచ్చు ధరణిలో క్లిక్ చేస్తే రెండు నిమిషాల్లో రైతులకు పూర్తి సమాచారం అందుతున్నది. ఈ సారి మా ఓటు కారుకే.
– సాయిగౌడ్, బొమ్మరాశిపేట
ఆ చీకటి రోజులు మర్చిపోతామా..
ఇయ్యాల రైతుల గోస తీరిందంటే.. అది 24 గంటల కరెంటుతోనే. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పొద్దున మూడు, రాత్రి మూడు గంటల కరెంటు ఇస్తుండే. కరెంటు లేక గోస ఒకవైపు.. మరోవైపు పొలాల దగ్గర రాత్రిళ్లు పురుగులు, పాములతో భయం భయంగా కాలం వెల్లదీసిన రోజులు అప్పుడే మర్చిపోతామా. మూడు గంటల కరెంటుతో నారుమడి కూడా పారదు. బీఆర్ఎస్ పాలనలో రైతులంతా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికే రైతుల సంపూర్ణ మద్దతు ఉంటుంది.
– సింగిరెడ్డి నర్సింహారెడ్డి, బాబాగూడ
మూడు గంటల కరెంటుతో నష్టం
కాంగ్రెసోళ్లు 3గంటలే విద్యుత్ ఇస్తామంటున్నారు దీనివల్ల చాలా నష్టాలు వస్తాయి. రైతులు కూడా వ్యవసాయం గిట్టుబాటు కాక వేరే పనులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూడు గంటలే కరెంట్ ఇచ్చి.. 10 హెచ్‌పీ మోటర్లు పెట్టుకోమంటే రైతులు వ్యవసాయం వదిలి వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే.. మళ్లీ చీకటి రోజులు వస్తాయి. అప్పులకోసం ప్రైవేటు వ్యక్తుల దగ్గరికి తిరగాల్సి వస్తుంది. బీఆర్ఎస్ పాలనలో సంబురంగా ఎవుసం చేసుకుంటున్నాం. మళ్లీ వారినే గెలిపిస్తాం.
– అర్జున్, దుండిగల్
కాంగ్రెసొస్తే.. మళ్ల అప్పులైతయ్
మూడు గంటలే కరెంట్ ఇస్తే వ్యవసాయం ఎట్లా కుదురుతుంది. కొత్తగా మోటర్లు, బోర్లు వేస్తే ఖర్చులు పెరుగుతాయి. కొత్తగా మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుంది. రెండుమూడేండ్లు గడిస్తే రాబడి కాదుకదా ఉన్నది తాకట్టు పెట్టాల్సి వస్తుంది. సమస్యలు పెరిగి వ్యవసాయం అంటేనే దండగ అనే పరిస్థితి మళ్లీ వస్తుంది. చిన్న రైతులు కూలీలుగా మారడమో, వలసలు వెళ్లడమో జరుగుతుంది. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంటుతో రైతులంతా సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ను మల్ల గెలిపించుకుంటాం.
– నాగమణి, దుండిగల్
కాంగ్రెస్‌కు ఓటేశారంటే ఆగమే
భూ రిజిస్ట్రేషన్ల కోసం సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి వ్యవస్థ చాలా బాగుంది. ధరణితోనే రైతుల భూములకు భద్రత ఉన్నది. ధరణికి ముందు భూములకు సంబంధించిన రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మా భూములు ఆన్లైన్లో ఉండటంతో రికార్డులను తారుమారు చేసే అవకాశం లేకుండా పోయింది. ధరణి పోర్టల్‌పై కాంగ్రెస్ చేస్తున్నవి పిచ్చి ఆరోపణలు. రైతులందరికీ న్యాయం జరుగుతుంటే ఆ పార్టీకి నచ్చడం లేదు. పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే అన్నదాతల బతుకులు ఆగమవుతాయి.
– జెమ్మల శ్రీనివాస్‌గౌడ్, రాంపల్లి
నారుమడి కూడా పారదు
ధరణితో మా భూమికి హక్కులు వచ్చాయి. ఆన్లైన్లో మా భూముల నమోదుతో అన్ని రకాల ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. రైతుబంధు పథకం నగదు నేరుగా ఖాతాల్లోనే జమ అవుతున్నాయి. రైతుబీమా పథకాన్ని వర్తింజేస్తున్నారు. ధరణి అంటే రైతులకు పూర్తి విశ్వాసం ఏర్పడింది. అన్నదాతలకు మంచి జరుగుతున్న ధరణిని తీస్తేస్తామని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సరికాదు. మూడు గంటల కరెంటుతో నారుమడి కూడా పారదు.10 హెచ్‌పీ మోటర్ల ద్వారా రైతులకు ఆర్థిక భారం అధికమవుతుంది. కాంగ్రెసోళ్లు వచ్చేది లేదు..సచ్చేది లేదు.
– ఏనుగు రామకృష్ణారెడ్డి, రాంపల్లి
ధరణి రద్దు చేస్తే దళారుల రాజ్యమే
ధరణి రద్దు చేస్తే దళారులు రాజ్యమే వస్తుంది. కాంగ్రెస్ నాయకులు రాజకీయ పబ్బం గడుపుకొనేందుకే చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్‌తో భూములకు రక్షణ దొరికింది. బీఆర్ఎస్ పాలనలోనే మా బతుకులు బాగుపడ్డాయి. రైతుల బాధలు తెలిసిన సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం కోసం ఇస్తున్న రైతుబంధుతో రెండు పంటలు పండుగలా పండుతున్నాయి. కాంగ్రెస్ పాలనలో పడిన గోసలు ఇంకా గుర్తుకు ఉన్నాయి. అందుకే వాళ్లకు ఓటేయం.
– మహేశ్, సీఆర్పీఎఫ్, జవహర్‌నగర్
అప్పట్లో అప్పలపాలయ్యాం
బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆర్ ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో పంటను పండించుకుని కుటుంబంతో హాయిగా బతుకుతున్నాం. కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన నాలుగైదు గంటల కరెంట్‌తో వేసుకున్న పంటలు ఎండిపోయి అప్పుల పాలయ్యాం. నాడు పంట వేయకపోతే తిండికి కష్టంగా ఉండేది. పంట వేస్తే ఎండిపోయి అప్పులు మిగిలేవి. ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంట్‌తో వ్యవసాయం పండుగలా మారింది. పొలం నిండా పంటతో కడుపునిండిపోతున్నది. ఇదంతా బీఆర్ఎస్ వల్లే.
– మలిగే యాదయ్య, రైతు, గౌడవెల్లి గ్రామం, మేడ్చల్ మండలం
గతంలో పొలాల దగ్గర కావలి ఉండేది
కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడొస్తుందో తెలియక పొలాల దగ్గరే కావలి ఉండాల్సివచ్చేది. పాసు బుక్కుకోసం గల్లీ లీడర్ల నుంచి జిల్లా అధికారుల వరకూ బ్రతిమిలాడినా పనులు జరిగేవికావు. పాత రెవెన్యూ పద్ధతిలో చాలా చిక్కులుండేవి. రిజిస్టరు చేయాలంటే.. చేసినా పాసుబుక్కు రావాలంటే సవాలక్ష తలనొప్పులు ఎదురవుతుండె. ధరణి విధానంలో నేరుగా తహసీల్దార్ ఆఫీసులోనే రిజిస్ట్రేషన్, మార్పిడి అంతా ఆన్లైన్లో చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అన్నీ సర్దుకుని రైతులు బీఆర్ఎస్ సర్కారు సాయంతో పంటలు పండించుకుంటున్నారు. వాళ్లు మల్ల రావాలె..వాళ్లకు ఓటు వేయాలె.
– అయినబోయిన మల్లేశ్, డి.పోచంపల్లి
బాయికాడికి మల్ల రాత్రిపూట పోవాల్నా..?
కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలతో అవస్థలు పడ్డాం. కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియక అర్ధరాత్రి బాయికాడికి పోయి ప్రమాదాలకు గురయ్యేవాడిని. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఉచిత కరెంటు, రైతుబీమా ఇవ్వడంతో మాకు ఎక్కడ లేని ధీమా వచ్చింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు సమయానికి రాకపోవడంతో అర ఎకరం పొలం కూడా పారకపోయేది. పంటలు పండక పిల్లల చదువు కూడా ఇబ్బందులు పడ్డాను. బీఆర్ఎస్ సర్కారు 24 గంటల కరెంటు ఇవ్వడంతో పంటలు విస్తారంగా పండుతున్నాయి. రైతులమంతా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ మాటలను రైతులు పట్టించుకునే స్థితిలో లేరు. ఆ పార్టీ అధికారంలోకి రాదు. రైతులు ఓట్లేయరు. కారునే గెలిపిస్తారు.
– పందిరి మల్లయ్య, మల్కారం, జవహర్‌నగర్