బీఆర్ఎస్ను నిలువరించేందుకు సిద్ధాంతాలు పక్కనపెట్టి బీజేపీ-మజ్లిస్ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ గెలుపు కోసం అహర్నిశలు కృషిచేశాయి. ఇందుకోసం ఓ వైపు మజ్లిస్, మరోవైపు కాషాయం కలిసి చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కటయ్యాయి. బల్దియా ఎన్నికల్లో 40కి పైగా సీట్లు, పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలను గెలుచుకున్న బీజేపీ.. స్నేహ‘హస్తం’ అందించి డిపాజిట్ కూడా చేజార్చుకొని తనకు తానుగా బలిపీఠం ఎక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల కంటే 10వేల ఓట్లు కోల్పోయి ఆ పార్టీ నేతలు ఆత్మవిమర్శ చేసుకొనే పరిస్థితికి దిగజారింది. కాంగ్రెస్-బీజేపీ-మజ్లిస్ జట్టు కట్టి నెరిపిన రాజకీయ మంత్రాంగం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీశాయి.
– సిటీబ్యూరో, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ)
జూబ్లీహిల్స్‌లో ఏ పార్టీని గెలిపిస్తున్నావ్ కిషన్రెడ్డీ అని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యల్లోని అంతరార్థం ఇప్పుడు అందరికీ బోధపడుతున్నది. కాంగ్రెస్‌తో దోస్తీ కట్టిన ముఖ్య నేతలు.. ఆ పార్టీని గెలిపించేందుకు సొంత పార్టీని బలిపీఠమెక్కించినట్టుగా మారింది. కేవలం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీసేందుకు డమ్మీ అభ్యర్థిని బరిలో దింపిన బీజేపీ అగ్రనేతలు.. కాంగ్రెస్ కోసం తమ పరువును తాకట్టు పెట్టింది. గత ఎన్నికల్లో పోల్చితే డిపాజిట్లు కూడా దక్కించుకోలేని స్థాయికి పార్టీని కమలం నేతలు దిగజార్చి ఎవరి ప్రయోజనాలకు పనిచేశారనేది ఇప్పుడు కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు.
గతంలో మజ్లిస్ నుంచి పోటీచేసిన నవీన్ యాదవ్, ఈసారి కాంగ్రెస్-మజ్లిస్ మిత్రపక్షం అభ్యర్థిగా బరిలో దిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితమైతే, మజ్లిస్ ఓట్లను మళ్లించుకొని మొదటి స్థానంలో నిలిచింది. ఇక మూడో స్థానంలో నిలిచిన లంకల దీపక్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో 24వేల ఓట్లను దక్కించుకుంటే ఈసారి ఏకంగా 10వేల ఓట్లను కోల్పోయారు. ఈ ఓట్లు గనుక బీఆర్ఎస్కు వచ్చి ఉంటే కాంగ్రెస్ మెజార్టీ తగ్గేది. కానీ ఇక్కడే కాంగ్రెస్-బీజేపీ-మజ్లిస్ కలిసి బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను ప్రభావితం చేశాయి. ఇక ఎన్నికలో గెలిచేందుకు కాంగ్రెస్ చేసిన ఆక్రమాలకు మడుగులొత్తినట్టు వ్యవహరించిన బీజేపీ మౌనం వహించింది. దీంతో విస్తృతంగా జరిగిన డబ్బు పంపిణీ, ఓట్లు మళ్లించుకునేందుకు బీజేపీ-మజ్లిస్ ప్రణాళికలన్నీ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేందుకు అనుకూలమైన పరిస్థితులను కల్పించాయి.
ఓట్ల కోసం మత రాజకీయాలకు పాల్పడే బీజేపీ, మజ్లీస్ పార్టీలు.. జూబ్లీహిల్స్ వేదికగా అదే విధానాన్ని పాటించాయి. కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించేందుకు జట్టు కట్టి బీఆర్ఎస్ ఓట్లను మళ్లించాయి. అందుకే గ్రేటర్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటిన ఆ పార్టీ ఉప ఎన్నికల్లో పేలవమైన తీరుతో బరిలో నిలిచింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఓటర్లను ఆకట్టుకొని, బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను దెబ్బతీసిన బీజేపీ నాయకులు, కాంగ్రెస్‌తో ఉన్న రహస్య స్నేహబంధాన్ని బలపరుచుకున్నాయి. దీంతోనే కాంగ్రెస్ కోసం ఏకంగా 10వేల ఓట్లను త్యాగం చేసిందనే చర్చ నడుస్తున్నది. ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ గెలుపు అవకాశాలను పెంచినట్లుగా ఓట్ల షేరింగ్ జరిగింది.
జూబ్లీహిల్స్ ఓటర్లు నోటాకు భారీగానే ఓట్లు వేశారు. ఏ అభ్యర్థి నచ్చనప్పుడు నోటాకు వేసే అవకాశాన్ని ఈసీ కల్పించింది. ఈ క్రమంలో బై పోల్‌లో 924మంది నోటాను ఎంచుకు న్నారు. వాస్తవంగా ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు ఉంటుం ది. కానీ నోటాకు ఎలాంటి గుర్తు ఉండదు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. ఇలా బైపోల్లో 924 మంది నోటా వైపు మొగ్గు చూపడం చర్చనీయాంశమైంది.