సిటీబ్యూరో, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): పోలింగ్ బూత్‌ల వద్దే డబ్బుల పంపిణీ.. ఇదేంటని ప్రశ్నించిన వారికి బెదిరింపులు, మాట్లాడితే దాడులు.. అధికార పార్టీ కార్యకర్తల కంటే ముఖ్యనేతలే ఏకంగా ఈ పనులకు పాల్పడడం జూబ్లీహిల్స్ ఎన్నికల చరిత్రలో ఇదే మొదటిసారిగా ఓటర్లు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా అరాచకం ఈ ఎన్నికలో జరిగిందని నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు స్థానికేతరులు అయినప్పటికీ ఏకంగా నియోజకవర్గంలోనే ఉండి తమ అనుచరులతో ఓటర్లకు నగదు పంపిణీ చేయించడం, ఓటర్ స్లిప్పులతో పాటు చీరెలు ఇచ్చారు.
ఓటర్లను బెదిరించి తమ పార్టీకే ఓటేయాలంటూ ఒత్తిడి చేయడంపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తే వారిపై దాడులకు దిగారు. పోలింగ్ ప్రారంభంలో కొంత ప్రశాంతంగా జరిగినా పన్నెండు గంటల నుంచి కాంగ్రెస్ తన అరాచకాలను మొదలుపెట్టింది. దొంగ ఓట్లు వేయడం, ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం, ఓటర్లను బెదిరించి తమకే ఓటేయాలని లేకపోతే అంతుచూస్తామని బెదిరించడం, పింఛన్లు ఆపేస్తామని చెప్పడంపై ఓటర్లు బహిరంగంగానే విమర్శించారు. అధికార పార్టీ అడుగడుగునా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడింది.
యథేచ్ఛగా డబ్బుల పంపిణీ..
రహ్మత్‌నగర్ 156 బూత్నెంబర్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అనుచరులు యథేచ్ఛగా డబ్బులు పంపిణీ చేశారు. ఇది జరుగుతున్న సేపు అధికారులు అక్కడే ఉన్నప్పటికీ చోద్యం చూశారు. పోలింగ్ కేంద్రాల్లోనే టోకెన్లు ఇచ్చి డబ్బులు పంచుతుంటే ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారని ఓటర్లు ప్రశ్నించారు. అలాగే బోరబండ డివిజన్లోని సైట్ 3 పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు. నిలదీసిన అడ్వకేట్ లలితారెడ్డిని చుట్టుముట్టి దౌర్జన్యంగా అక్కడి నుంచి పంపించేశారు. ఓ డివిజన్లో కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బులు పంచుతుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు పట్టుకున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నారని కార్పొరేటర్ సామల హేమ పోలీసులకు చెప్పగా వారు పట్టించుకోలేదు.
దుర్భాషలాడుతూ బెదిరింపులు..
బోరబండ డివిజన్ బూత్ నెంబర్ 337 రాయన్ టెక్నో స్కూల్‌తో పాటు పలు చోట్ల సీరియల్ నెంబర్ 2తో కాంగ్రెస్ ప్రచార టీ షర్ట్స్ వేసుకుని కాంగ్రెస్ నాయకులు, యువకులు ప్రచారం చేస్తుంటే ఆ టీషర్ట్లు తీసేయాలని అడిగితే ఎవరికి చెప్పుకుంటరో చెప్పుకోండంటూ వాదించడం కనిపించింది. షేక్‌పేట్ డివిజన్ డైమండ్ హిల్స్‌కాలనీ బూత్‌నెంబర్ 66,67లలో ఎమ్మెల్యే కౌసర్‌మొహినుద్దీన్ బెదిరింపులకు పాల్పడ్డారు. బీఆర్ఎస్ పోలింగ్ ఏజెంట్లను బలవంతంగా పంపించారు. ఇతర నియోజకవర్గాల నుంచి ఓటర్లను తీసుకెళ్లి భారీ సంఖ్యలో రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. ఐడీ కార్డులు లేకున్నా ఓటర్లు ఓటు వేయడం ప్రిసైడింగ్ అధికారులను సైతం కాంగ్రెస్, ఎంఐఎం నాయకులు బెదిరించారు.
అంతేకాకుండా వీడియో తీస్తున్న జర్నలిస్టుల ఫోన్లను లాక్కున్నారు. పారామౌంట్ కాలనీ బూత్ నెంబర్లు 56,57,58, అజీజ్‌బాగ్ పోలింగ్ బూత్ నెంబర్ 35,36,37, సమతాకాలనీ బూత్నెంబర్లు 6,7,8లలో ఎంఐఎం నేతలు హల్చల్ చేశారు. సిద్దార్థనగర్ బూత్ 120 వద్ద తన కాన్వాయ్‌లో తిరుగుతూ డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హల్చల్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ నియోజకవర్గంలో ఓటు హక్కు లేకుండా డిప్యూటీ సీఎం ఎలా పర్యటిస్తారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ ఎన్నికల అధికారులను నిలదీసింది.
బోరబండ సైట్3లో ఓటర్‌లిస్ట్ ఎత్తుకు పోవడమే కాకుండా అడిగిన మహిళా కార్యకర్తలపై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ అనుచరులు దుర్భాషలాడుతూ వారిని అక్కడి నుంచి పంపించేశారు. బోరబండ డివిజన్లో మంత్రి సీతక్క అనుచరుడు, ములుగు జిల్లా డీసీసీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ హల్చల్ చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారితో కాంగ్రెస్‌కు ఓటు వేస్తామని ఒట్టు వేయించుకున్నారు. ఎర్రగడ్డ డివిజన్లో కాంగ్రెస్‌కు ఓటేయకపోతే పింఛనల ఆపేస్తామని తన తల్లిని బెదిరిస్తున్నారని ఒక ఓటరు ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రశ్నిస్తే దాడులు..
దొంగ ఓట్లను కట్టడి చేయాలని చెబితే కాంగ్రెస్ నేతలు దాడి చేశారంటూ మొయిద్ఖాన్ వాపోయాడు. ఓ మహిళ తాను ఓటు వేయకుండానే తన ఓటును ఇతరులు వేయడంతో అది గమనించి ప్రశ్నిస్తే తనను కొట్టడానికి వేరే కాలనీకి చెందిన కాంగ్రెస్ నేత వచ్చాడంటూ ఆమె తెలిపారు. బోరబండలో మాగంటిసునీతా గోపీనాథ్‌ను సపోర్ట్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్త వేణుగోపాల్చారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడంతో ఆయన ముఖంపై,చేతికి గాయాలయ్యాయి. షేక్‌పేట డివిజన్ బీజేవైఎం ప్రెసిడెంట్ స్వస్తిక్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. పోలింగ్ రోజు బయట తిరుగొద్దని వార్నింగ్ ఇచ్చారు. ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఆయన ఫిర్యాదు చేశారు. తనపై కాంగ్రెస్ నాయకుడు సాయినాథ్ అలియాస్ లడ్డూతో పాటు మరో నలుగురు కలిసి దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.