కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ క్షేత్రస్థాయిలో సాంకేతిక లోపాలతో నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ యాప్‌ల మొరాయింపుపై ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వివరాల నమోదుకు వెళ్తున్న బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) సర్వర్లు మొరాయిస్తుండటంతో వివరాల నమోదులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటునారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందక కొంతమంది, పత్రాలు నింపడం రాక మరికొంతమంది, ఆన్లైన్ సేవలు అర్థంకాక మరికొంతమంది అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో లక్షలాది మంది ఓట్లు తొలగిపోయే అవకాశం ఉండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.
– సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ)/ మల్కాజిగిరి/కొండాపూర్

డేటా మిస్‌మ్యాచ్.. అప్డేట్ లేని ఆధార్ శాపం!
మరోవైపు ఓటరు కార్డు, ఆధార్ వివరాల నమోదులో ‘డేటా మిస్ మ్యాచ్’ (సమాచార లోపం) తలవొప్పిగా మారింది. ఓటరు కార్డులో ఉన్న పేరు, వయస్సు, చిరునామా.. ఆధార్ కార్డులో ఉన్న వివరాలతో సరిపోలడం లేదు. చాలామంది పౌరులకు ఆధార్ కార్డులు అప్డేట్ కాకపోవడం, పాత ఫోన్ నంబర్లు లింక్ అయి ఉండటంతో ఈ సాంకేతిక చికుముడులు మరింత బిగుసుకుంటున్నాయి. చిరునామా మార్పిడి, కొత్త ఓటరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే వారు ఈ డేటా మిస్‌మ్యాచ్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.గ్రామంలో ఓటరుగా ఉన్నవారు, పత్రాలు అందనివారు, ఇళ్లు మారినవారు, తమ పత్రాలు ఆన్లైన్లో నింపడానికి ప్రయత్నిస్తే ఇబ్బందులు తప్పడంలేదు.
విదేశాల్లో పిల్లలు..ఫారాలు తల్లిదండ్రుల వద్ద..
ఓటర్లుగా ఉన్న వారి, వారి కుమారులు, కోడళ్ల పత్రాలను బీఎల్వోలు ఇండ్లకు వెళ్లి అందజేశారు. అయితే తల్లిదండ్రులు ఇండ్లలోనే ఉంటున్నప్పటికీ కొంతమందికి సంబంధించి కుమారులు, కోడళ్లు మాత్రం విదేశాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇబ్బందులు తప్పడం లేదు. మల్కాజిగిరికి చెందిన ఓ వ్యక్తి తన కుమారులు, కోడళ్లు, కుమార్తె విదేశాల్లో ఉంటున్నారని.. పత్రాలు నింపడం, వాటిపై వారి వివరాలు నమోదు చేయడం వరకు బాగానే ఉన్నప్పటికీ పత్రంపై సంతకం చేయాలనే నిబంధన ఉంది. ఇది ఎలా సాధ్యమని బీఎల్ఓలను సంప్రదిస్తే, ఆన్లైన్లో ఎన్ఆర్ఐ ఆప్షన్ ఉందని తెలిపారు. అయితే ఆన్లైన్లో మాత్రం సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు వారు వాపోతున్నారు. ఇలా ఉపాధి కోసం ఊరు, రాష్ట్రం, దేశం దాటి వెళ్లిన వారికి సంతకాల నిబంధన తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది.

Ghmc Rv2
ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటించాలి
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ ) : జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ బుధవారం చార్మినార్ జోనల్ పరిధిలోని చంచల్‌గూడ, చావ్నీ ప్రాంతాల్లోని పోలింగ్ స్టేషన్లలో జరుగుతున్న సర్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజలతో మాట్లాడి సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. సర్ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ క్షేత్రస్థాయిలో ఎలా జరుగుతుందో సమీక్షించారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని, కేటాయించిన పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. ఓటర్లకు సమర్థవంతంగా సేవలు అందించాలని ఏఈఆర్వో, బీఎల్ఓ పర్యవేక్షక అధికారులను కమిషనర్ ఆదేశించారు.
ప్రభుత్వానికి ఎస్ఐఆర్పై చిత్తశుద్ధి లేదు
కంటోన్మెంట్, జూలై 8: ఎస్ఐఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వానికి సీరియస్‌నెస్ లేదని, ఇప్పటివరకు సగం మంది ఓటర్లకు కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ అందలేదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గం తిరుమలగిరి విలేజ్‌లో బోర్డు మాజీ సభ్యుడు పి.శ్యామ్‌కుమార్‌తో కలసి స్థానిక ప్రజలతో సమావేశమై ఎస్ఐఆర్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా క్రిషాంక్ మాట్లాడుతూ కంటోన్మెంట్ బీఎల్వోలకు గత మూడేళ్లుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపివేశారని అన్నారు. ఇప్పటికే గడువు తక్కువగా ఉందని, సీఈవో ఎన్నికల విభాగం అధికారులు వెంటనే బీఎల్వోలకు జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
బీఏల్వోలకు ఎస్ఐఆర్పై నిర్వహించిన అవగాహన కార్యక్రమం కాంగ్రెస్, బీజేపీ నేతలు వ్యవహరించిన తీరుతో అసంపూర్తిగా ముగిసిందని అన్నారు. ఎస్ఐర్పై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు బీఎల్వోలు స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నారని, ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలే కారణమన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇంకా అందలేదన్నారు. ఎస్ఐఆర్ విషయమై ప్రభుత్వం గడువు పెంచాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారని చెప్పారు. ఎన్నికల విభాగం అధికారులు దృష్టి సారించి ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రఘు, మోని, సాయి కిరణ్, సాయికుమార్, బంటి, రిషి, రాజిరెడ్డి, ఉమేష్, అనురాధరెడ్డి, బస్తీవాసులు పాల్గొన్నారు.
ఆధార్, ఓటర్ మ్యాచింగ్ కావడం లేదు
ఎస్ఐఆర్ నమోదుకు ఆన్లైన్లో సమస్యలు ఎదురవుతున్నాయి. సాధారణంగా యాప్ ఓపెన్ చేసి స్వతహా వివరాలను నమోదు చేసుకుందామంటే యాప్‌లో ఆధార్‌లో ఉన్న వివరాలను అప్లోడ్ చేయాల్సి వసున్నది.. అయితే దీనికి ఓటర్లో ఉన్న వివరాలు మ్యాచింగ్ కావడం లేదు. దీంతో దరఖాసుతలు తిరస్కరణకు గురవుతున్నాయి. చిన్న స్పేస్ ఇచ్చినా ఆన్లైన్లో ఎస్ఐఆర్ నమోదు అవ్వడం లేదు.
– సురేందర్‌రెడ్డి, వెంకటేశ్వర కాలనీ
ఓటరు నమోదు సైట్లో ముందుగా
సర్ నమోదులో కొత్తగా వివరాలు నమోదు చేసుకునే సమయంలో పాత వివరాలు అందుబాటులోకి రావడం లేదు. వాటికోసం సపరేట్ విండోలో చూడాల్సి వస్తుంది. https:// voters.eci.gov.in/ సైట్లో సర్ అప్లికేషన్ కోసం ముం దుగా రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ప్రక్రియ సులభమవుతుంది. అలా కాకుండా నేరుగా ఐప్లె చేసే క్రమంలో డాక్యుమెంట్స్ (ఆధార్, ఓటీపీలు, ఫోటో) అప్లోడ్ గందరగోళంగా ఉంది.
– రామకృష్ణ సాగర్, గుల్మోహర్ పార్కు కాలనీ
ప్రత్యేక వెబ్సైట్ ఉంటే బాగుంటుంది
సర్ అప్లికేషన్ చేసుకునేందుకు వెబ్సైట్లోకి వెళ్లి వెతుకునే పని లేకుండా, కొత్త దరఖాస్తుల (సర్ ఫారం/ ఫారం 6 వంటివి) పూర్తి చేయడానికి నేరుగా ఐప్లె చేసుకునేలా ఒక ప్రత్యేక వెబ్సైట్ లేదా లింక్ అందుబాటులో ఉంచితే సులభంగా ఉండేది. దీనివల్ల సాధారణ పౌరులు కూడా ఎవరి సహాయం లేకుండా ఫారం నింపే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఉన్న ప్రక్రియ ఇబ్బందికరంగా ఉంది. తెలియని వారైతే అనేక ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ సాంకేతిక లోపాలను ఎన్నికల సంఘం గమనించి, వెబ్సైట్ ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా మార్చితే బాగుంటుంది.
– మదీనగూడ

Sir
ఇదేంటి ‘సర్’
సిటీబ్యూరో, జూలై 8 (నమస్తే తెలంగాణ)/ మల్కాజిగిరి,: ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో పౌర సేవలు పూర్తిగా పడకేశాయి. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) కార్యక్రమం పౌరుల రోజువారీ అవసరాలకు శాపంగా మారింది. మున్సిపల్ అధికారులంతా సర్ ప్రక్రియ అమలులో నిమగ్నం కావడం, అంతకుముందు జనగణనలో ఉండటంతో గడిచిన రెండు నెలలుగా రోజూ ఆఫీసుల చుట్టూ పౌరులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ‘సార్ వాళ్లు ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు.. తర్వాత రండి’ అనే సమాధానమే వినిపిస్తుండటంతో వివిధ పనుల నిమిత్తం సర్కిల్, జోనల్, ప్రధాన కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఓటర్ల వెరిఫికేషన్‌కు బూత్ లెవల్ అధికారులు (బీఎల్ఓలు)గా ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జోనల్ ఆఫీసర్లు నిరంతరం ఫీల్డ్‌లోనే గడుపుతున్నారు. ఉన్నతాధికారులు సైతం సమీక్షలు నిర్వహిస్తుండటంతో కార్యాలయాల్లో కుర్చీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఓటర్ల సవరణ ముఖ్యం కాదనలేం..కానీ పౌర సేవలను పూర్తిగా నిలిపివేయడం అన్యాయమని సగటు పౌరుడు ప్రశ్నిస్తున్నాడు.
కార్యాలయాల్లో కానరాని అధికారులు, సిబ్బంది..
ఒకవైపు జనగణన.. మరోవైపు సర్ కార్యక్రమంతో గడిచిన 2 నెలలుగా పాలన స్తంభించిపోయింది. ప్రజలకు సేవలు అందించే అధికారులు, సిబ్బంది అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. క్యూర్ పరిధిలోని కార్యాలయాల్లో సిబ్బంది చాలావరకు సర్ విధుల్లో ఉన్నారు. ఎల్ఆర్ఎస్ కోసం ఓ సర్కిల్ కార్యాలయానికి వచ్చిన ఓ వ్యక్తికి టౌన్‌ప్లానింగ్ అధికారులు అందుబాటులో లేరని చెప్పారు. గత 2 నెలలుగా తిరుగుతున్నా అదే సమాధానం వస్తోందని తెలిపారు.
మల్కాజ్గిరి జోన్లో..
మల్కాజిగిరి జోన్ పరిధిలో టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒకే ఒక ఏసీపీ ఉన్నారు. ఈ అధికారి మౌలాలి, కీసర సర్కిళ్లకు కూడా ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. మల్కాజిగిరిలో టీపీఎస్‌గా పనిచేస్తున్న అధికారిని ఇటీవలే హెడ్ ఆఫీస్‌కు అటాచ్ చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో తొమ్మిది డివిజన్లకు ఇద్దరే ఏఈలు, ఒక్కరే డీఈ ఉన్నారు. ఈఈ పోస్టు ఖాళీగా ఉంది. ఉప్పల్ జోన్ పరిధిలో 6 డివిజన్లకు ఇద్దరే ఏఈలు, ఒక డీఈ పనిచేస్తుండగా, ఇన్చార్జి ఈఈతోనే పాలన కొనసాగిస్తున్నారు. టౌన్‌ప్లానింగ్ విభాగంలో ఒక్కరే ఏసీపీ ఉండగా, వీరు బొడుప్పల్, జోనల్ కార్యాలయాలకు కూడా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు.
ఖజానాపై తీవ్ర ప్రభావం..
జీహెచ్ఎంసీ పరిధిలో సాధారణ రోజుల్లో రోజుకు సుమారు రూ.2 కోట్ల వరకు వచ్చే ఆస్తి పన్ను ఆదాయం, ప్రస్తుతం కనీసం 30 శాతానికి కూడా చేరడం లేదని ఆర్థిక విభాగం అధికారులు చెబుతున్నారు. సైబరాబాద్, మలాజిగిరి కార్పొరేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో మూడు కార్పొరేషన్ల పరిధిలో నిత్యావసర మెయింటెనెన్స్, సిబ్బంది వేతనాల కోసం నెలకు సుమారు రూ.275 కోట్ల నుంచి రూ.325 కోట్ల వరకు వ్యయం అవుతుంది. ట్యాక్స్ వసూలు చేసే సిబ్బంది కొరత కారణంగా ఈ ప్రభావం నేరుగా కార్పొరేషన్ల ఖజానాపై పడుతోంది. రాబోయే నెలరోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. ఉద్యోగుల వేతనాల చెల్లింపులతో పాటు, నగరంలో చేపట్టే రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులకు నిధుల కొరత తీవ్రంగా వేధించే ప్రమాదం ఉందని ఫైనాన్స్ విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.