బడంగ్‌పేట: బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్లో అధికారుల మధ్య వివాదం ముదిరింది. 32 డివిజన్లపై డీఈ జ్యోతి ఆధిపత్యం సాగిస్తూ..వస్తున్నారు. కార్పొరేషన్లో ప్రస్తుతం ముగ్గురు డీఈలు ఉన్నారు. యాదయ్య, నర్సింహ రాజు, జ్యోతి..వీరు 32 డివిజన్ల పరిధిలో ఉన్న అభివృద్ధి పనులను పర్యవేక్షించాలి.32 డివిజన్లకు ఏఈ వినీల్ గౌడ్ ఒక్కరే ఉన్నారు. అయితే ఏఈలు చేయాల్సిన పనులన్నీ డీఈ జ్యోతి చేస్తున్నారు. అభివృద్ధి పనులకు అంచనా వేయాలన్న, టెండర్ వేయాలన్నా..ఏఈ తప్పని సరిగా క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది.
ఏఈ స్థానంలో డీఈ జ్యోతి సంతకాలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. డీఈ అంతా తానై కార్పొరేషన్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఏఈ చేయాల్సిన పనులు కూడా డీఈ చేయడంతో గొడవ నడుస్తున్నది. ఏఈ వినీల్ గౌడ్ చూస్తున్న డివిజన్లను కూడా తొలగించి.. డీఈ చూడటంతో మరింత వివాదం ఏర్పడింది. కొంతమంది కాంట్రాక్టర్లను తన చాంబర్లో కూర్చోబెట్టుకోవడం, మరికొంత మంది కాంట్రాక్టర్లతో కనీసం ఫోన్లు చేసినా మాట్లాడక పోవడం, సమయం ఇవ్వకపోవడం వంటివి చేస్తుండటంతో సదురు డీఈపై అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. కాగా, కమిషనర్ సరస్వతి డీఈ, ఏఈలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అధికారుల మధ్య నెలకొన్న వివాదాలపై అడిగి తెలుసుకున్నారు. డివిజన్లను అందరూ సమానంగా చూసుకోవాలన్నారు. అందుకు డీఈ జ్యోతి అంగీకరించలేదు. అన్ని తానే చూస్తానని చెప్పడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 16 డివిజన్లు నర్సింహ రాజు, 16 డివిజన్లు డీఈ జ్యోతి చేసుకోవాలని తెలిపారు. 32 డివిజన్లను ఏఈ వినీల్ గౌడ్ చూస్తారని చెప్పారు. ఏఈ పనిచేయలేరని కమిషనర్ ముందు డీఈ ప్రస్తావించారు. దీంతో కమిషనర్ ముందే లొల్లి మొదలైంది . కాగా, బడంగ్‌పేటలో జరుగుతున్న తతంగం చూసి డీఈ యాదయ్య తప్పుకున్నారు. తాను కూడా వెళ్లిపోతానని డీఈ నర్సింహ రాజు కమిషనర్‌కు స్పష్టం చేశారు.