సిటీబ్యూరో, జూన్ 12(నమస్తే తెలంగాణ): వృద్ధులపై జరుగుతున్న దారుణాలతో వారు ఒంటరిగా ఇండ్లలో ఉండాలంటేనే బిక్కు బిక్కుమంటూ భయంతో గుడపాల్సిన పరిస్థితి నెలకొంటున్నది. నగరం నడిబొడ్డున, నగర శివార్లలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో వృద్ధులకు రక్షణ లేకుండాపోతున్నదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో చాలా మంది ఒంటరి వృద్ధులు ఉంటారు. పిల్లలు ఉద్యోగాల నిమిత్తం విదేశాలు, స్వదేశాల్లో ఉండడం, చాలా మంది ఒంటరిగానే ఉంటున్నారు. అసలే వారికి ఆరోగ్య పరమైన ఇబ్బందులతో ఆందోళనల్లో ఉంటుంటారు. అలాంటి వారిని అక్కున చేర్చుకోవాల్సిన సమాజంలోని కొందరు నేర స్వభావం కల్గిన వాళ్లు వారిపై అఘాయిత్యాలకు సైతం పాల్పడుతున్నారు.
వృద్ధులపై నేరాలకు పాల్పడుతున్న వారిలో చాలా మంది తెలిసిన వాళ్లే ఉంటున్నారు. ఒంటరి వృద్ధుల హత్యలు.. లైంగికదాడి యత్నాలు… వృద్ధులను దోచుకోవడం… వారి వద్ద దొంగతనం చేయడం వంటి కేసులు తరచూ పోలీస్స్టేషన్లకు వస్తున్నాయి. వారి సొంత పనులు చేసుకునేందుకు వారిలో సత్తువ లేకుండా పోతున్న సమయంలో వారిపై దాడులు చేయడం సభ్యసమాజమే సిగ్గుపడాల్సిన పరిస్థితి. అయితే నేర స్వభావం ఉన్న వాళ్లు మద్యం, గంజాయి మత్తులోనూ ఈ దారుణాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతున్నాయి. దీంతో పాటు వృద్ధులను లక్ష్యంగా చేసుకొని వారిని హత మార్చి ఆస్తులను కొట్టేయాలనే దుర్బిద్ధి కొందరిలో ఉంటుంది.
ఇలా ఒక్కొక్కరూ ఒక్కో ఆలోచనతో వృద్ధులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడడం ఆందోళన కల్గిస్తోంది. తాజాగా హైదరాబాద్ శివారులోని యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో 90 ఏండ్ల వృద్ధురాలిపై గంజాయి, మద్యం మత్తులో యువకులు లైంగికదాడికి యత్నించిన ఘటన తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలకు తావులేకుండా ఉండేందుకు పోలీసులు ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని, నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.
అంబర్‌పేట్‌లో లింగారెడ్డి(80), ఆయన భార్య ఉర్మిళ(70)ని గత ఏడాది అక్టోబర్ నెలల్లో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఇద్దరు వృద్ధ దంపతులే ఇంట్లో ఉంటారు. ఈ కేసులో నిందితులను ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. ఈ కేసు మిస్టరీగానే మారిపోయింది. దోపిడీ దొంగతనం లక్ష్యంగా ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేసినా ఆ కోణంలో తగిన ఆధారాలు లభించలేదు. దీంతో ఆర్థికపరమైన, కుటుంబ పరమైన, ఇంకా ఇతరాత్ర వ్యవహారాలే ఈ హత్యకు దారి తీసి ఉంటాయనే
మిగతా నుమానంతో ఇంకా ఈ కేసు దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసు ఇప్పటి వరకు ఛేదించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒకప్పడు హైదరాబాద్‌లో నేరం జరగొద్దు.. జరిగితే వెంటనే ఆయా కేసులను ఛేదించాలనే పట్టుదలతో పోలీసులు పనిచేసేవారు.
ఇప్పుడు ఆ పట్టుదల ఏమైందనేదీ ప్రశ్నార్థకంగా మారింది. రాజేంద్రనగర్‌లోని అర్బిజ్ రెసిడెన్సీలో నివాసముండే రిటైర్డు బ్యాంకు ఉద్యోగి అబ్దుల్లా(77), రిటైర్డు పాలిటెక్నికల్ కాలేజీ లెక్చరర్ రిజ్వాన్ బేగం(70) దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు బాధితులైన అబ్దుల్లా వద్ద గతంలో డ్రైవర్‌గా పనిచేసిన షకీల్‌గా గుర్తించారు. షకీల్ తన స్నేహితుడైన ముజీబుద్దీన్‌తో కలిసి ఈ హత్య చేసినట్లు నిర్ధరణ కావడంతో ఇద్దరిని రాజేంద్రనగర్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. 8 నెలల క్రితం ఉద్యోగం నుంచి తీసేయడంతో, మరెక్కడ కూడా ఉద్యోగం దొరకక వృద్ధులపై పగ పెంచుకున్న షకీల్, వృద్ధులు నివాసముండే అపార్టుమెంట్లోకి బుర్కాతో తెలిసిన వ్యక్తులుగా లోపలికి వెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు.
నగర శివారులోని కందుకూర్ గ్రామ శివారులో వ్యవసాయ క్షేత్రంలో నివాసముండే నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ఊశయ్య(70), శాంతమ్మ(65) దంపతులను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకున్న రాచకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ కేసుతో పాటు మరుగున పడిపోయిన మరో కేసును కూడా ఛేదించారు. దాసర్లపల్లి గ్రామానికి చెందిన శివకుమార్(25) మద్యం మత్తులో ఈ వృద్ధ దంపతులను హత్య చేసినట్లుగా నిర్ధారించారు. నిందితుడు ఒంటరి మహిళలు కన్పిస్తే వాళ్లపై లైంగికదాడి, లైంగికదాడి యత్నానికి పాల్పడే స్వభావం ఉండడంతో పోలీసులు లోతైన దర్యాప్తు జరపడంతో 2023లో ఫామ్ హౌస్‌లో ఒక మహిళలను హత్య చేసిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.