Sabitha Indra Reddy | బడంగ్ పేట్, ఫిబ్రవరి 22 : పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. తుక్కుగూడ మున్సిపాలిటీ అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. అసంపూర్తిగా ఉన్న స్మశాన వాటిక పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. తుక్కుగూడ వరకు రోడ్డు విస్తరణ చేయాల్సి ఉందని తెలిపారు. కొంతమేరకు పనులు అయినా.. ఇంకా పూర్తి కావాల్సి ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం హైవే రోడ్డుపై ఫుట్ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేయిస్తామమని చెప్పారు. దీనికోసం రూ. 3 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. సంయుక్త మార్కెటు పనులను త్వరగా పూర్తి చేయవలసి ఉందన్నారు. స్ట్రీట్ వెండర్స్ కు అవకాశం కల్పించవలసిన అవసరం ఉందన్నారు.
ఈ సమీక్షాసమావేశంలో భాగంగా తుక్కుగూడ మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలపై సబితా ఇంద్రారెడ్డి ఆరా తీశారు. జరుగుతున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచాలని సూచించారు. ముఖ్యంగా రాబోయేది వేసవికాలం అని మున్సిపాలిటీలో ఎక్కడ కూడా నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. కొత్తగా వెలుస్తున్న విల్లాలు, కాలనీలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించవలసిన అవసరం ఉందని సూచించారు. రానున్న రోజులలో తుక్కుగూడ మెయిన్ సెంటర్‌గా మారబోతుందని అన్నారు. అందుకు అనుగుణంగానే ట్రాఫిక్ సమస్య రాకుండా రోడ్ల విస్తరణ చేపట్టవలసిన అవసరం ఉందని తెలిపారు. ప్రధాన సమస్యలపై అధికారులు దృష్టి సారించవలసిన అవసరం ఉందన్నారు. చేయవలసిన పనులు, టెండర్ వేయవలసినవి పరిశీలించి త్వరగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాణి రెడ్డి, మేనేజర్ పర్వతాలు, ఆర్ఐ మల్లేష్ మరి ఇతర మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.