సిటీబ్యూరో, నవంబర్ 30 ( నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో ఇటీవల డీఎస్సీ టీచర్ల భర్తీలో కొందరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న దగ్గర ఉపాధ్యాయులను కేటాయించకపోవడం.. అవసరం లేని చోట టీచర్లను కేటాయించడం చేశారు. పాఠశాలలో ఉన్న ఖాళీలను అధికారులు చూపించకపోవడంతో ఇష్టానుసారంగా భర్తీ ప్రక్రియ ముగించారు. అయితే ఈ నిర్లక్ష్యంపై ‘నమస్తే’లో కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. దీనిపై హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌తో విచారణ చేయించారు. విచారణలో బాధ్యులైన సదరు డిప్యూటీ ఐఓఎస్‌ల నుంచి వివరణ తీసుకున్నారు.
ఈ వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం ఉందని కలెక్టర్‌కు నివేదిక అందించారు. అయితే దీనిపై బాధ్యులైన సదరు డిప్యూటీ ఐఓఎస్‌లపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డీఈఓకు ఆదేశాలు ఇచ్చారు. చర్యలు తీసుకునేందుకు డీఈఓ వారి నుంచి వివరణ కోరనున్నారు. అనంతరం కలెక్టర్ ఆ వివరణ ఆధారంగా చర్యలు తీసుకోనున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ జిల్లా విద్యా శాఖలో కలకలం రేపుతున్నది. బాధ్యులైన డిప్యూటీ ఐఓఎస్‌లు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసుకుని తమ గోడును వెల్లబోసుకున్నట్టు తెలిసింది. అదనపు భారంతో సతమతమవుతున్నామని చెప్పినట్టు తెలిసింది. తమపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మద్దతుగా నిలవాలని సంఘాలకు విన్నవించుకున్నారు.
అయితే ఈ వ్యవహారంపై కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. కాగా, హైదరాబాద్‌లో డీఎస్సీ 2024లో 584 మంది అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చారు. 878 పోస్టులకు గాను కోర్టు కేసులు, రిజర్వేషన్ కేటగిరీలో అభ్యర్థుల కొరత, ఇన్ సర్వీస్ తదితర కారణాలతో 262 పోస్టులు పెండింగ్‌లో ఉన్నాయి. మిగతా 616 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినప్పటికీ ధ్రువీకరణ పత్రాల రీ వెరిఫికేషన్‌తో 32 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు నిలిపివేసిన విషయం తెలిసిందే. నియామక పత్రాలు అందుకున్న వారిలో 386 ఎస్జీటీ, 107 ఎస్ఏ, 91 ఎల్పీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు లభించాయి.