సిటీబ్యూరో, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : ప్రజావాణిలో(GHMC Prajavani) అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడంపై దృష్టి సారించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి పలు సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన ప్రజల నుండి కమిషనర్ ఇలంబర్తి ఆర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో ఆయా విభాగాలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా అందుతున్నందున వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించాలని సూచించారు. టౌన్ ప్లానింగ్ సంబంధించిన క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కాగా ప్రజావాణి ఫోన్ ఇన్ ప్రోగ్రాం ద్వారా ఆరు విన్నపాలు రాగా, సత్వర పరిష్కారానికి ఆయా విభాగాలకు పంపించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 73 విన్నపాలు రాగా అందులో టౌన్‌ప్లానింగ్ విభాగానికి 41, ఇంజినీరింగ్ మెయింటనెన్స్ 8, హౌసింగ్ నాలుగు, ట్యాక్స్, ఫైనాన్స్, ల్యాండ్ అక్విజేషన్, వెటర్నరీ, యుబిడి విభాగాలకు మూడు చొప్పున, ఎలక్ట్రికల్ రెండు, శానిటేషన్, హెల్త్, ఎస్టేట్స్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 91 ఆర్జీలు రాగా, అందులో కూకట్‌పల్లిలో 45, సికింద్రాబాద్‌లో 16, శేరిలింగంపల్లిలో 17, చార్మినార్‌లో ఆరు, ఎల్బీనగర్లో 7 ఆర్జీలు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు.