హైదరాబాద్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : పోలీసులకు ‘ఆరోగ్య భద్రత’ కరువైంది. నెట్వర్క్ హాస్పిటళ్లకు సర్కార్ కోట్లల్లో బకాయి చెల్లించని కారణంగా వారి కుటుంబాలు వైద్యానికి నోచుకోవడం లేదు. ‘డబ్బులుంటేనే వైద్యం’ చేస్తామని దవాఖానల యా జమాన్యాలు తేల్చిచెబుతుండటంతో ఆందోళనకు గురవుతున్నారు. పోలీసుల పట్ల దవాఖానల సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును వీడియోలు తీసి, తమ ఇబ్బందులను ఆడియా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అయినా పోలీస్ ఉన్నతాధికారుల్లో గానీ , ప్రభుత్వ పెద్దల్లో గానీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
పోలీస్ ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆస్పత్రులకు చెల్లించాల్సిన మొత్తం సుమారు రూ.350 కోట్ల వరకూ పెండింగ్‌లో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. పెద్ద మొత్తంలో బకాయి ఉండటంతో ఆరోగ్య భద్రత కింద వైద్యం అందించే దవాఖానలు పోలీసులకు వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి. తాజాగా బంజారాహిల్స్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఓ కుటుంబానికి పోలీస్ ఆరోగ్య భద్రత కింద వైద్యం అందించేందుకు ఆస్పత్రి వైద్యుడు మొదట నిరాకరించాడు. ఆ అన్యాయంపై బాధితుడి సోదరుడు వీడియో తీస్తూ ప్రశ్నించడంతో అడ్మిట్ చేసుకుంటామంటూ బుకాయించాడు. ఈ తతంగంతో పాటు వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ వీడియో తీసి పోలీస్ గ్రూపుల్లో పోస్ట్ చేసి, ఆడియో ద్వారా వివరించాడు. ఆ వీడియోకు ఇతర పోలీసులు తమ అభిప్రాయాలను జత చేస్తున్నారు.
ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకపోవడం వల్లే తమ కుటుంబాలకు సరైన వైద్యం అందడం లేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల సంక్షేమం విషయంలో రేవంత్ సర్కార్‌కు పట్టింపు లేదని మండిపడుతున్నారు. కేసీఆర్ హయాంలో ఎలాంటి షరతులు లేకుండా వైద్యం అందిస్తే.. ఇప్పుడు సవాలక్ష కొర్రీలు పెడుతూ వైద్యం చేసేందుకు కూడా వెనుకాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి బకాయిలు వి డుదల చేయలేక.. నెలకు కేవలం రూ.10కోట్ల లోపే విడుదల చేయడం వల్ల అవి కూడా మేజ ర్ దవాఖానలకే వెళ్తున్నాయని తెలిసింది. ఇక జిల్లాల్లో అయితే కేవలం వేలల్లోనే వెళ్తున్నట్టు చెబుతున్నారు. ఇకనైనా ఆరోగ్య భద్రతకు పథకానికి సంబంధించిన 24/7 స్పందించేలా ఒక టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని పోలీసులు, వారి కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి వస్తాయని కోరుతున్నారు.