గార్ల, ఫిబ్రవరి 10 : ఆస్తి దక్కకుండా చేస్తున్నదన్న కోపంతో ఓ అల్లుడు తన అత్తకు కరెంట్ షాక్ పెట్టి చంపిన ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో జరిగింది. ఎస్సై సాయికుమార్ కథనం ప్రకారం.. గార్ల మండలం సీతంపేట గ్రామ పంచాయతీ పరిధిలోని మంగళితండాకు చెందిన బానోత్ రాజేశ్ అన్న రమేశ్‌కు 15 ఏండ్ల క్రితం పెండ్లి జరిగింది. కొద్ది రోజులకే రమేశ్‌ను భార్య వదిలిపెట్టి వెళ్లింది. ఈ క్రమంలో రాజేశ్ అత్త, జూలూరుపాడుకు చెందిన ధరావత్ కౌసల్య (50) తన అన్న కూతురుతో రమేశ్‌కు పెండ్లి సంబంధం కుదిర్చింది. మూడు రోజుల క్రితం వారికి మంగళితండాలోనే పెండ్లి జరిపించారు. పెండ్లి సందర్భంగా రాజేశ్, రమేశ్‌కు ఉన్న కుటుంబ ఆస్తిలో అర ఎకరం భూమిని అమ్మాయి పేరుపై రాయించారు.
దీంతో తనకు ఆస్తి దక్కకుండా చేస్తున్నారని కక్ష పెంచుకున్న రాజేశ్ అత్తామామలను చంపాలని పథకం వేశాడు. మూడు రోజులుగా వారిని తన ఇంట్లో ఉంచుకొని మద్యం తాగించాడు. మంగళవారం తెల్లవారుజామున అందరూ నిద్రిస్తుండగా.. కర్రకు విద్యుత్ వైర్లు అమర్చి తొలుత మామకు కరెంట్ షాక్ పెట్టాడు. అతను స్పృహ కోల్పోవడంతో చనిపోయినట్టుగా భావించి, తర్వాత అత్త కౌసల్యకు కరెంట్ షాక్ పెట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈలోగా కుటుంబ సభ్యులు మేలుకొని రాజేశ్‌ను అడ్డుకోగా, అన్న భార్య అంజలి, తన భార్యను కత్తితో గాయపర్చాడు. విష యం తెలుసుకున్న గార్ల, బయ్యారం, డోర్నకల్, మహబూబాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతురాలు కౌసల్య భర్త ధరావత్ రాందాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.