Power Cuts | సిటీబ్యూరో, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): సరిపడా కరెంట్ ఉన్నా.. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరాను చేయడంలో విద్యుత్ శాఖ విఫలమవుతోంది. నిర్వహణ లోపం వల్లే పదే పదే వస్తున్న అంతరాయాలు విద్యుత్ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించాలంటే విద్యుత్ నెట్ వర్క్‌లో నిర్వహణ, మరమత్తులే అత్యంత కీలకం.
ఇప్పటికే వినియోగంలో ఉన్న విద్యుత్ నెట్‌వర్క్‌ల పనులు చేసేందుకు కాంట్రాక్టర్లను ఎంపిక చేసిన ఉన్నతాధికారులు.. వారు చేస్తున్న పనులపై సరిగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. డిపార్టుమెంట్‌కు సంబంధించిన పనులను కాంట్రాక్టర్లు మొక్కుబడిగా చేయడం వల్లే తరచూ సరఫరాలో అంతరాయాలకు కారణమవుతున్నట్లు వినియోగదారులు పేర్కొం టున్నారు.
నిత్యం క్షేత్ర స్థాయిలో ఉండి విద్యుత్ లైన్లను పర్యవేక్షించాలని ఉన్నతాధికారులు ఆదేశించినా.. కింది స్థాయి అధికారులు మాత్రం కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) నిర్వహించే ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 10 ఆపరేషన్స్ సర్కిళ్లలో నిత్యం ఎక్కడో ఒకచోట నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందనే ఫిర్యాదుల పోస్టులు చేస్తూనే ఉన్నారు.