Congress | ఆర్కేపురం, ఆగస్టు 28: విజయవాడ జాతీయ రహదారి పక్కన యథేచ్ఛగా అక్రమ నిర్మాణం జరుగుతున్నా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడంలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. రహదారి పక్కన నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణం చేపడుతున్నట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ.. అధికారులు ఆయారాం గయారాం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆర్కేపురం డివిజన్ అష్టలక్ష్మీ దేవాలయం ఆర్చి పక్కన కాంగ్రెస్ నాయకుడి అక్రమ నిర్మాణంపై స్థానికులు టౌన్ ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బుధవారం టౌన్‌ప్లానింగ్ అధికారులు పోలీస్ సిబ్బందితో వచ్చి భవనంపై అదనంగా అక్రమంగా నిర్మాణం చేపట్టిన రేకుల షెడ్డును మాత్రమే తొలగించారు. రెండు వైపులా రోడ్లను ఆక్రమించి, సెట్ బ్యాక్ లేకుండా చేపట్టిన నిర్మాణాన్ని తొలగించలేదు. కేవలం రేకుల షెడ్డును మాత్రమే తొలగించారంటూ అధికారుల తీరు పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తూతూ మంత్రంగా రేకుల షెడ్డును మాత్రమే కూల్చివేశారని స్థానికులు మండిపడుతున్నారు.
అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో పాటు ఇటీవల హైడ్రా ద్వారా చర్యలు చేపడుతున్నప్పటికీ స్థానిక టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం చేతి వాటానికి అలవాటుపడి అక్రమ భవన నిర్మాణంపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సదరు భవనం కాంగ్రెస్ పార్టీ నాయకుడిది కావడంతో తూతూ మంత్రంగా కూల్చివేసి వెళ్లారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జోనల్ కమిషనర్ ఈ అక్రమ నిర్మాణంపై విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రధాన రహదారిపై నిబంధనలను ఉల్లంఘించి నిర్మిస్తున్న భవనం కాంగ్రెస్ పార్టీ నాయకుడిదని తెలుస్తుంది. స్థానికులు, ఇతర రాజకీయ పార్టీల నాయకులు ఆ భవనంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా.. టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఏం జరిగిందో తెలియదు గాని.. బుధవారం ఉదయం జీహెచ్ఎంసీ అధికారులు చైతన్యపురి పోలీసులను వెంటబెట్టుకొని భవనం వద్దకు వచ్చారు. పెంట్ హౌస్‌పై నిర్మించిన షెడ్డు రేకులను తీసి పక్కన పెట్టి.. ఫొటోలు తీసి ఫోజులిచ్చారని స్థానికులు తెలిపారు.