బేగంపేట్, అక్టోబర్ 1: కొందరు బడా భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, జంపింగ్ ఎమ్మెల్యే కలసి గాజుల రామారంలోని సర్వేనెంబరు 307లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో పట్టాగా నమ్మిస్తూ వేల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ పరిధిలోని గాజుల రామారం సర్వే నెంబర్ 307లో ఉన్న 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లో ఉన్న కబ్జాలను ఇటీవల హైడ్రా తొలగించడం, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ అనుచరులు వచ్చి ఫెన్సింగ్ తొలగించి తిరిగి స్వాధీనం చేసుకోవడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రజలకు దక్కాల్సిన విలువైన ప్రభుత్వ భూముల్ని కాపాడాలని బుధవారం ఎమ్మెల్యే కృష్ణారావు, ఎమ్మెల్సీ శ్రవణ్ నెక్లెస్ రోడ్డులోని హైడ్రా కమిషనర్ కార్యాలయానికి వచ్చి కమిషనర్ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. దీనికంటే ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విజిలెన్స్ వంటి విభాగాలతో పాటు తాసీల్దార్ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. హైడ్రా కమిషనర్‌ను కలిసిన అనంతరం ఇద్దరూ మీడియాతో మాట్లాడారు. గాజుల రామారంలోని 307 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూముల్లో చోటుచేసుకున్న అక్రమాలు వెలికి తీయడమే కాకుండా ఎలాంటి భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేయవద్దని కోరుతూ జీహెచ్ఎంసీ కమిషనర్‌కు కూడా వినతి పత్రం సమర్పించడం జరిగిందని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు.
హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు వినతి పత్రం అందించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొందరు బడా భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, జంపింగ్ చేసిన ఎమ్మెల్యే తదితరులంతా మూకుమ్మడిగా 307 సర్వేనెంబర్లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ పట్టా భూమిగా నమ్మిస్తూ తప్పుడు పత్రాలు సృష్టించారు. వేల కోట్ల విలువ చేసే భూములను కబ్జా చేసిన విషయం హైడ్రా కూల్చివేతలతో బయటపడిందని అన్నారు. నెల రోజుల కిందట ఇదే విషయంపై ఫిర్యాదు చేయడంతో అధికారులు అప్పటికప్పుడే చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన వెల్లడించారు. హైడ్రా ఫెన్సింగ్ వేసిన తర్వాత కూడా కొందరు అక్రమార్కులు దౌర్జన్యంగా దాన్ని తొలగించి మళ్లీ కబ్జా చేసి అందులో పనులు చేపడుతున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలకు పాల్పడిన పెద్దలను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హైడ్రా కమిషనర్‌ను కోరామన్నారు.
ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ తొలగించిన వారిపై ఎందుకు కేసులు పెట్టడంలేదని, ఇందులో తాత్సారం చేయడం వెనక మతలబు ఏమిటని అధికారులను ఆయన ప్రశ్నించారు. వెంటనే గాజుల రామారంలోని ప్రభుత్వ భూములను కాపాడాలని అందులో పేదల ఇండ్ల జోలికి వెళ్లకుండా, పేదలకు అక్కడే పక్కా ప్రభుత్వం ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లోని పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 307లోని సర్వే నెంబర్లో అక్రమంగా వెలసిన వెంచర్లో ప్లాట్లు కొని ఎవరూ మోసపోవద్దని సూచించారు. ఈ భూమిని డబుల్ బెడ్రూం ఇండ్లకు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. గాజుల రామారంలోని 307 సర్వే నెంబర్లో ఉన్న వేల కోట్ల విలువ చేసే 320 ఎకరాల ప్రభుత్వ భూమిని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కబ్జా చేశాడని మండిపడ్డారు. అతడితోపాటు అనేక మంది పెద్దలు అక్కడి భూమిలో వెంచర్లు వేశారని అన్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన ఎమ్మెల్యేనే కబ్జా చేయగా..ప్రజల ఆస్తిని కాపాడేందుకు కూకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు పోరాటం చేస్తున్నారన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసి వాటిని క్రమబద్ధీకరించుకునేందుకే గాంధీ పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్లారన్నారు. అలాంటి వారిని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని విమర్శించారు. పార్టీ ఫిరాయింపుల చట్టం వర్తించకుండా అడ్డుపడుతూ, కబ్జాదారులకు ముఖ్యమంత్రి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. ప్రజలెవ్వరూ ఇక్కడి ప్రభుత్వ భూములను కొని మోసపోద్దని సూచించారు.