Hyderabad | అమీర్పేట, మార్చి 3 : సనత్ నగర్ హనుమాన్ దేవాలయంలో అధికారులకు కనీస సమాచారం లేకుండా అర్చకుడి స్థాన మార్పు అంశం వివాదాస్పదంగా మారింది. దేవాదాయ శాఖ పరిధిలోని సనత్ నగర్ హనుమాన్ దేవాలయ ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకత్వం చేస్తున్న విజయేంద్రపై మూడేళ్ల క్రితం భక్తులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ కు లిఖితపూర్వక ఫిర్యాదులు చేశారు.
అప్పట్లో దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ అర్చకుడు విజయేంద్ర పై వచ్చిన ఆరోపణలపై విచారణ నిర్వహించిన అనంతరం స్థాన మార్పిడి చేస్తూ దేవాలయ ఆవరణలోని పోచమ్మ ఆలయానికి అర్చకుడిగా నియమించారు. అప్పటినుంచి పోచమ్మ ఆలయంలోనే విధులు నిర్వర్తిస్తున్న అర్చకుడు విజయేంద్రను రెండు రోజుల క్రితం స్థానిక కార్పొరేటర్ తిరిగి ఆంజనేయ స్వామి అర్చకునిగా కూర్చోబెట్టినట్టు వస్తున్న ఆరోపణలతో స్థానికులు బి.కృష్ణగౌడ్, పుట్నాల రాజేశ్వర్ (రాజన్న), బి.రవీందర్ గౌడ్, కె.శ్రీనివాస్ రెడ్డి, కన్నయ్య యాదవ్, బి. హనుమంతరావు తదితరులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దేవాలయ ఈవో సత్యనారాయణ నాయుడుకు ఈ విషయమై లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన ఈవో వెంటనే విజయేంద్రను తిరిగి పోచమ్మ దేవాలయానికి అర్చకుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో వివాదం సద్దుమణిగింది.