సిటీ బ్యూరో, మే 30: ప్రజలకు సేవలందించాల్సిన కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ మాఫియాలా మారి సామాన్యులనే పట్టి పీడిస్తున్నాడని పేర్కొంటూ న్యాయవాది జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. అతని అరాచకం వల్లే బీఆర్ఎస్కు చెందిన ఓ మైనారిటీ నేత ఆత్మహత్యకు కారణమయ్యాడని అందులో పేర్కొన్నారు. ఈ మేరకు ప్రముఖ న్యాయవాది రామారావు ఇమ్మానేని హక్కుల కమిషన్లో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ సామాన్యులను బెదిరిస్తూ అక్రమ వసూళ్లు చేస్త్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడని పిటిషన్లో తెలిపారు. స్థానికంగా ఓ మాఫియాలా మారి సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ కార్పొరేటర్ ఫసియుద్దీన్ ప్రజలు ఇండ్లు కట్టుకుంటూ ఉంటే..ఎక్కడ పడితే అక్కడ వాలిపోయి రౌడీ మామూళ్లు వసూలు చేసుకుంటున్నాడని తెలిపారు.
ఆయన వేధింపులు తట్టుకోలేక బీఆర్ఎస్ నాయకుడు సర్దార్ ఇంటి మూడో అంతస్తుపై నుంచి దూకి సర్దార్ ఆత్మ హత్య చేసుకున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు బాబా ఫసియుద్దీన్, అతని భార్య హబీబా సుల్తానా, కార్పొరేటర్ పీఏ సప్తగిరిలపై.. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించాలంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ను న్యాయవాది రామా రావు ఇమ్మానేని తన పిటిషన్లో అభ్యర్ధించారు.కాగా జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ పిటిషన్ను కేసు నెంబర్ 12386/ఐ. ఎన్./2025 గా నమోదు చేసింది. త్వరలోనే విచారణ చేపట్టనుంది.