సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి సమస్యలను పరిశీలించారు. శేరిలింగంపల్లి మండలం గోపన్నపల్లి గ్రామంలోని రంగనాథనగర్ను సందర్శించిన రంగనాథ్ ప్లాట్ ఓనర్ల సంఘం ఇచ్చిన ఫిర్యాదుపై స్థానికంగా విచారణ చేపట్టారు. 1985లో 184 ఎకరాల పరిధిలో 850కి పైగా ప్లాట్లతో లేఔట్ వేయగా.. తామంతా ప్లాట్లు కొన్నామని ప్లాట్ల ఓనర్లు రంగనాథ్‌కు చెప్పారు.
కొందరు తమ ప్లాట్లను కబ్జా చేసి రహదారులు, పార్కులు అన్నీ కలిపేసి వ్యవసాయ భూమిగా మార్చుకున్నారని, దీనిపై సుప్రీం కోర్టు వరకు వెళ్లామని, మున్సిపల్ అధికారులు కూడా కోర్టు ఆదేశాలను పాటించడంలేదని వారు వాపోయారు. తమ ప్లాట్ల దగ్గర బౌన్సర్లను పెట్టి బెదిరిస్తున్నారని రంగనాథ్‌కు చెప్పారు. వారం పది రోజుల్లో ఇరుపక్షాలను పిలిచి మాట్లాడుతానని, ఇక్కడ ఆందోళన చేయొద్దని ప్లాట్ యజమానులకు చెప్పారు. అంతకు ముందు మేడ్చల్ జిల్లా చెంగిచెర్ల, బోడుప్పల్ ప్రాంతాల్లో పర్యటించిన రంగనాథ్ అక్కడి నుంచి వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దేవాదాయశాఖ ట్రస్ట్ భూములను ఆక్రమించి ఆ పక్కనే ఉన్న లేఔట్‌ను కబ్జా చేయడానికి మాజీ ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారంటూ శ్రీమాత అరవింద కాలనీ వాసులు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. బోడుప్పల్ గ్రామంలో వికాస్ వెల్ఫేర్ కాలనీలో స్థానికుల ఫిర్యాదును పరిశీలించారు. గోపన్నపల్లిలో హౌసింగ్‌బోర్డుకు కేటాయించిన 60 ఎకరాల భూమిలో ఫెన్సింగ్ వేయనివ్వడం లేదంటూ స్థానిక అధికారులు ఫిర్యాదు చేయగా.. కమిషనర్ అక్కడి వారిని విచారించారు. షేక్‌పేటలోని ఓయూ కాలనీలో రోడ్ల అక్రమాలపై ఫిర్యాదు రావడంతో అక్కడి కూడా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.