సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ ) : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను బాధ్యతతో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులకు సూచించారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులను కమిషనర్ స్వీకరించారు. ఫిర్యాదులను ఆయా విభాగాలకు పంపి తక్షణ చర్యలకు సంబంధిత అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 78 విన్నపాలు రాగా టౌన్‌ప్లానింగ్ విభాగానికి 45, ట్యాక్స్ సెక్షన్ 13, శానిటేషన్ నాలుగు, ఇంజినీరింగ్ విభాగం మూడు, జలమండలి రెండు, భూ సేకరణ, ఫైనాన్స్, ఏసీ లీగల్, విజిలెన్స్ విభాగాలకు ఒకటి చొప్పున ఫిర్యాదులు అందగా ఫోన్ ఇన్ ద్వారా ఏడు ఫిర్యాదులను స్వీకరించినట్లు పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ఆరు జోన్లలో మొత్తం 146 అర్జీలు స్వీకరించగా, కూకట్‌పల్లిలో 57, సికింద్రాబాద్‌లో 53, శేరిలింగంపల్లిలో 17, చార్మినార్‌లో 8, ఎల్బీనగర్ జోన్లో ఆరు, ఖైరతాబాద్‌లో ఐదు అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు వేణుగోపాల్, సత్యనారాయణ, యాదగిరి రావు, వేణు గోపాల్ రెడ్డి, పంకజ, నళిని పద్మావతి, సీసీపీ శ్రీనివాస్, అడిషనల్ సీసీపీలు వెంకన్న, గంగాధర్, ప్రదీప్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
దోమల నివారణకు చర్యలు చేపట్టండి
దోమల నివారణకు ఏఎల్ఓ కార్యక్రమాలు చేపట్టాలని కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. అడిషనల్ జోనల్ కమిషనర్లు, ఆయా విభాగాల హెచ్ఓడీలతో సోమవారం ఉదయం దోమల నివారణ, శానిటేషన్, కోర్టు కేసులపై కమిషనర్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయా జోన్లలో ఎంటమాలజీలో పనిచేస్తున్న సిబ్బంది ఏఎల్ఓ కార్యక్రమాలు చేయకుండా ఇతర విధులు కేటాయించినట్లు తెలిసినందున వారిని ఏఎల్ఓ కార్యక్రమాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని జోనల్, డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. శుభ్రతపై చేపడుతున్న ముందస్తు వర్షాకాల శానిటేషన్ డ్రైవ్‌ను మరిన్ని రోజులు కొనసాగించాలన్నారు.