సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : భవన నిర్మాణ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. గురువారం కూకట్పల్లి సర్కిల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జీడిమెట్ల డివిజన్ అల్లం చెరువు, ఫాక్స్ సాగర్ చెరువు, హెచ్ఎంటీ, షాపూర్‌నగర్ సీ అండ్ డీ వ్యర్థాల సేకరణకు ఖాళీ స్థలాన్ని, ఐడీపీఎల్ జంక్షన్ అభివృద్ధి పనులు, జీడిమెట్ల డివిజన్లో దండమూడి ఎంక్లేవ్ దగ్గర అల్లం చెరువు చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. చెరువు కట్టపై ఉన్న కొన్ని ప్రైవేట్ బోర్డులను తొలగించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. హెచ్ఎంటీ కాలనీ సీ అండ్ డీ వ్యర్థాల కోసం సేకరించిన స్థలం నుంచే ఇక నుంచి వ్యర్థాలను సీ అండ్ డీ ప్లాంట్‌కు తీసుకొని పోవాలని కమిషనర్ పేర్కొన్నారు. ఫాక్స్ సాగర్ చెరువు తూము ప్రాంతానికి వెళ్లి కమిషనర్ పరిశీలించారు.
చెరువులో నీరు దిగువ ప్రాంతానికి పంపిస్తున్న కారణాలను అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షాల సందర్భంగా ఆ సమయంలో చెరువు నుంచి నీరు విడుదల చేస్తే దిగువ ప్రాంతాల్లో ఉన్న లోతట్టు కాలనీల్లో వరద ముంపు ఏర్పడుతున్న నేపథ్యంలో చెరువులో నీటిమట్టాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఇప్పటి నుంచే విడుదల చేస్తున్నట్లు జోనల్ కమిషనర్ వివరించారు. ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ మమత, డిప్యూటీ కమిషనర్ నాగమణి, ఎస్ఈ చిన్నారెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, టౌన్‌ప్లానింగ్, ఏసీపీ సాయిబాబా, ఏఎంవోహెచ్ మంజుల తదితరులు పాల్గొన్నారు. కాగా, భవన నిర్మాణ వ్యర్థాలు ఉంటే 18001201159 నంబర్‌కు కాల్ చేయాలని అధికారులు సూచించారు.