సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో చెరువులు, నాలాలు, పార్కులు, ఇతర ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించడమే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా తాజాగా మరో నిర్ణయం తీసుకున్నది. జూలై 19న ఏర్పాటైన హైడ్రా.. ఇప్పటి వరకు 23 ప్రాంతాల్లో 262 నిర్మాణాలను కూల్చివేసి.. 111.72 ఎకరాలను స్వాధీనం చేసుకున్నది. అయితే నిర్మాణాల తాలూకు వ్యర్థాలను ఎక్కడికక్కడే వదిలి వేసింది.
111 ఎకరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన హైడ్రా.. డెబ్రీస్‌ను ఎత్తివేయకుండానే చెరువుల పరిరక్షించామని చెబుతుండటం ఎంత వరకు సమంజసమని పర్యావరణవేత్తలు ప్రశ్నించారు. దీంతో మేల్కొన్న హైడ్రా వ్యర్థాల తరలింపు బాధ్యతలు తీసుకున్నది.
ఈ మేరకు గురువారం టెండర్లను ఆహ్వానించింది. ఆసక్తి ఉన్న ఏజెన్సీలు ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా టెండర్ బిడ్డర్‌లో పాల్గొనాలని కమిషనర్ రంగనాథ్ సూచించారు. కూల్చివేతల్లో వినియోగించాల్సిన మిషనరీ, గడిచిన మూడేండ్లలో రూ.2కోట్ల టర్నోవర్ ఇతర అర్హతలతో టెండర్‌ను ఆహ్వానించారు.