సిటీబ్యూరో, మే 1 (నమస్తే తెలంగాణ) : కమర్షియల్ గ్యాస్ ధరలు ఆకాశన్నంటాయి. అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం ప్రారంభం నుంచి ఇప్పటికే రెండు సార్లు పెరిగిన ధరలు తాజాగా మూడోసారి సైతం పెరిగాయి. రూ.993 పెంచుతూ.. కేంద్రం ప్రకటన జారీ చేసింది. ఈ పెంపుతో దేశ వ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ ధర రూ. 3,071 అయింది. ఇప్పటికే గ్యాస్ సరఫరా ఆలస్యం అవుతుండటంతో కమర్షియల్ గ్యాస్ నిర్ణీత సమయానికి రావడం లేదు. ఈ ప్రభావం నగరంలో హోటళ్లు, రెస్టారెంట్స్ తదితర ఫుడ్ ఇండస్ట్రీపై పెను ప్రభావం చూపింది. ఇప్పటికే బ్లాక్ మార్కెట్లో ఒక్క కమర్షియల్ గ్యాస్ ధర రూ. 6వేల వరకు పలుకుతోంది.
ఇప్పుడు అధికారికంగా గ్యాస్ ధర పెంపుతో బ్లాక్ మార్కెట్లో ధర రూ.10వేల వరకు ఉంటుందని నగరానికి చెందిన ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు తెలిపాడు. ఈ పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్స్ వినియోగదారులపై భారం మోపనున్నాయి. ఇప్పటి వరకు ఉన్న ప్లేటు ఇడ్లీ రూ. 45 ఉంటే తాజాగా రూ.70 అయిందని ఓ వినియోగదారుడు తెలిపారు. అమీర్‌పేట, దిల్‌సుక్‌నగర్, సికింద్రాబాద్, ఎల్లారెడ్డిగూడ, శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో గిగ్ ఎకానమి కార్మికులు, ఐటీ విద్యార్థులు, అసంఘటిత రంగ ఉద్యోగులు నివసించే హాస్టళ్లు, పీజీ వసతులు మరింత డిమాండ్ పలకనున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ అనాలోచిత నిర్ణయాలతో లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే నిరుద్యోగంతో అతలాలకుతలమవుతుంటే ఏదో ఒక వ్యాపారం చేసుకుని బతుకులీడిస్తున్న వారి జీవితాలపై గ్యాస్‌బండ భారం మోపారు. దీంతో నగరంలో ఇప్పటికే హాస్టళ్లు, పీజీ వసతి కేంద్రాలు మూసివేతకు సమీపిస్తున్నాయి. తాజాగా వాణిజ్య గ్యాస్ ధర భారీగా పెరగడంతో ఇక మూసివేత తప్పేలా లేదని నిర్వాహకులు, వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర హోటల్ సంఘం అధ్యక్షుడు ఎస్. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. “ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. పెరిగిన ధరల భారాన్ని వినియోగదారులపై వేయలేం. మేం భారీ నష్టాన్ని చవి చూడబోతున్నాం.
ఇప్పటికే మా వ్యాపారం మందకొండిగా సాగుతున్నది. ధరల పెరుగుదలపై కేంద్రం పునరాలోచన చేయాలన్నారు.” రోడ్ సైడ్ ఫుడ్ తయారీదారులు ఇప్పటికే 60 శాతం మూసివేసుకున్నారు. తాజా పెంపుతో ఇక రోడ్ సైడ్ చిరుతిండ్ల వ్యాపారుల జీవితాలు కనుమరుగు కానున్నాయి. కాగా, డొమెస్టిక్ గ్యాస్ ధరలు సైతం పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రానున్న రోజుల్లో సామాన్య, మధ్య తరగతి ప్రజలు, వ్యాపారులకు గడ్డు పరిస్థితులు ఎదురుకానున్నాయని చెబుతున్నారు.
హాస్టల్, పీజీ వసతుల నెలవారీ ఫీజులూ పెరగబోతున్నాయి. రూ.5వేలు హాస్టల్ పీజు ఉండగా ఇప్పుడు రూ.7వేల వరకు చార్జీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని హాస్టల్ నిర్వాహకుడు చెప్పాడు. కాగా, 19కేజీల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఫిబ్రవరి నుంచి ఇది మూడో పెంపు కాగా, దేశీయ ఎల్పీజీ ధరలు యధాతథంగా ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర పెరుగుతూ వస్తున్నది. మార్చిలో మొదట సుమారు 115 పెరగగా, ఆ తర్వాత ఏప్రిల్ 1న దాదాపు రూ.200 పెంచారు. ప్రస్తుతం రూ.993 పెరిగింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పెరిగితే ప్రత్యక్షంగా ఫుడ్ ఇండస్ట్రీ, పరోక్షంగా వాటిపై ఆధారపడే కార్మికులు రోడ్డునపడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.