అన్ని సౌకర్యాలతో ఆహ్లాదకర వాతావరణం
పిల్లలను పంపేందుకు తల్లిదండ్రుల ఆసక్తి
కవాడిగూడ, ఏప్రిల్ 17: ప్రభుత్వం పేద మధ్య తరగతి చిన్నారులకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఫ్రీ స్కూల్స్‌లో ఉన్న మౌలిక వసతులతో పాటు అదనపు సౌకర్యాలతో కవాడిగూడ డివిజన్లోని భీమా మైదాన్‌లోని అంగన్ వాడీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. చిన్నారులకు చదవటం, రాయటం, ఆటలు, పాటలు, కథలు నేర్పిస్తూ చదువు నేర్చుకునేందుకు మానసికంగా సిద్ధం చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో ఉన్న కలర్‌ఫుల్ బొమ్మలు, వివిధ రకాల జంతువుల చిత్రాలు ఎంతో ఆకర్శనీయంగా ఉండటంతో చిన్నారులు ఆసక్తితో విద్యనభ్యసిస్తున్నారు.
బొమ్మలు.. పలు రకాల చిత్రాలు..
భీమా మైదాన్‌లోని అంగన్వాడీ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీ కేంద్రంగా తీర్చి దిద్దారు. అంగన్వాడీ ఆవరణలో రంగురంగుల బొమ్మలతో వివిధ రకాల చిత్రాలను రూపొందించారు. వాటిలో చిన్నారులు సులువుగా అక్షరాలు నేర్చుకునేందుకు అక్షరాలు, నంబర్లను సైతం గోడలపై రాశారు. ఇతర అంగన్వాడీ సెంటర్లకు భిన్నంగా భీమా మైదాన్ ఉండటంతో చిన్నారులను ఇక్కడకు పంపేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు.
ఇంటిని మరిపించే విధంగా..
చిన్నారులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో ఆహ్లాదంగా, సంతోషంగా గడుపుతున్నారు. చిన్నారులు ఇక్కడికి రాగానే ఇంటిని మరిచిపోయే విధంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. ఆడుకునేందుకు 38 రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. అక్షరాలను గుర్తించే విధంగా మరికొన్ని వస్తువులు ఉన్నాయి.
చదువుతో పాటు ఆటలు
ఇక్కడ సౌకర్యాలు చూసి చిన్నారుల తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. పిల్లలను ఇక్కడ చేర్పిస్తే వారికి చదువుతో పాటు ఆటలు, పాటలపై ఆసక్తి పెరిగేలా ప్రత్యేక చొరవ తీసుకుంటాం.
–సంతోషిణి, అంగన్వాడీ టీచర్, భీమా మైదాన్