సిటీబ్యూరో, జూన్ 2 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో అర్ధరాత్రి అంధకారం అలుముకుంటున్నది. అసలే మండే ఎండలతో పగలంతా ఉక్కిరిబిక్కిరి అవుతున్న నగర వాసులు.. అర్ధరాత్రి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఉక్కపోత తట్టుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీల వాసులంతా ఒక్కసారిగా ఇండ్లనుంచి బయటకు వచ్చి.. అర్ధరాత్రి అసహనంతో ఏకంగా విద్యుత్ సబ్ స్టేషన్లకు వెళ్లి ఆందోళనలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి.
బాచుపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ ఫీడర్ల పరిధిలో శుక్రవారం రాత్రి 10:30 నుంచి సుమారు 3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర అసహనానికి గురైన సాయినగర్, ఇంద్రానగర్, ప్రగతినగర్‌లోని జీపీఆర్ లేఅవుట్ కాలనీలకు చెందిన ప్రజలు అర్ధరాత్రి సబ్‌స్టేషన్ ముందు బైఠాయించారు. విద్యుత్ అధికారులకు, ఏఈకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏఈ డౌన్‌డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు కోతలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి కరెంటు పోవడంతో ఉక్కపోతతో నిద్ర పట్టడం లేదని వాపోయారు. చివరకు రాత్రి 1:30గంటల ప్రాంతంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో ఆందోళన సద్దుమనిగింది.
నగర శివారు ప్రాంతమైన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ కిస్మత్పూర్ సబ్ స్టేషన్ పరిధిలో ఆదివారం రాత్రి 11గంటల సమయంలో సుమారు గంట పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ లోడ్ పెరిగిపోవడంతో కాయిల్ పేలిపోయి అంతరాయం కలిగిందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగదారులు మాత్రం అర్ధరాత్రి గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం ఏమిటని మండిపడుతున్నారు. చాలా మంది ఆన్లైన్ వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఒకటి, రెండు చోట్ల మాత్రమే కాదు గ్రేటర్ వ్యాప్తంగా 9 సర్కిళ్ల పరిధిలో ప్రతి రోజు పగటి వేళల్లోనే కాకుండా రాత్రి వేళల్లోనూ విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని వాపోతున్నారు.
విద్యుత్ శాఖలో నిర్వహణ, మరమ్మతుల పేరిట విద్యుత్ సరఫరాను ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు నిలిపి వేస్తున్నారు. అసలే వేసవి కాలం కావడంతో పగటి పూట ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిర్ణీత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను నిలిపి వేసి చెట్ల కొమ్మల తొలగింపు, ఇతర పనులు చేపడుతున్నారు. అయితే పొద్దంతా కరెంటు లేక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు.., రాత్రి సమయంలోనూ కరెంటు కోతలు విధించడంతో కంటిమీద కునుకులేకుండా పోతుందని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో ఎప్పుడూ చూడలేదని పేర్కొంటున్నారు.