మేడ్చల్, మార్చి7(నమస్తే తెలంగాణ): మేడ్చల్ జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 34 గ్రామ పంచాయితీలలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తుగా చర్యలు తీసుకుని నివారణకు ప్రణాళికలను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ గౌతమ్ అధికారులకు ఆదేశించారు. అయితే నీటి ఎద్దడి అధికంగా ఉండే ప్రాంతాలను ఇప్పటి వరకు గుర్తించలేదని తెలుస్తోంది.
నీటి ఎద్దడిపై ప్రజలు సమాచారం ఇస్తే తప్ప మున్సిపాలిటీల, గ్రామ పంచాయితీల పరిధిలో చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. నీటిని సరఫరా చేసే బోర్లు, చేతిపంపులలో తగినంత నీరు రాని పక్షంలో మరమ్మతులు చేయించేలా చర్యలు తీసుకోవడంలో అధికారులు నీటి ఎద్దడి నివారణ ప్రణాళికను అమలు చేయడంలో విఫలమవుతున్నారు.