సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఈశాన్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే 4నుంచి 5డిగ్రీల వరకు పడిపోతున్నాయి. దీంతో గ్రేటర్‌పై చలి పులి పంజా విసురుతుంది.
ఈ క్రమంలోనే మూడు నాలుగు రోజులుగా నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 13డిగ్రీల నుంచి 14డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగరంలో రాత్రి ఉష్ణోగ్రతలు 13.8డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 29.6డిగ్రీలు, గాలిలో తేమ 40శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రాగల మరో మూడు నాలుగు రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలున్నట్లు అధికారులు తెలిపారు.