సిటీబ్యూరో, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడ్ ఆఫ్ కండక్ట్) ఆమల్లోకి వచ్చింది. నవంబరు 11న పోలింగ్, 14న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నది. దీంతో రాబోయే 39 రోజుల పాటు 15 నియోజకవర్గాల్లో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోనున్నాయి.
కొత్త పథకాలు ప్రకటించడం, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు. దీంతో పాటు అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే జిల్లాలో పడకేసిన అభివృద్ధిపై ‘కోడ్’ కూయడంతో ప్రజలకు మరిన్ని ఇబ్బందులు తప్పవని, మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అభివృద్ధిని పూర్తిగా కుంటుపడేసిందని జనం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క ప్రాజెక్టుకు నోచుకోలె
హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్ఆర్డీపీ పథకాన్ని చేపట్టి 38 ప్రాజెక్టులను రికార్డు స్థాయిలో అందుబాటులోకి తెచ్చి ముఖ్యమైన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపింది. ఎస్ఎన్డీపీ ద్వారా దాదాపు 450 కాలనీలకు వరద ముంపును తప్పించింది.
సంక్షేమం, అభివృద్ధిని జోడెద్దులా మాదిరిగా హైదరాబాద్‌ను ప్రగతి పథం వైపు తీసుకువెళ్లింది. కానీ గడిచిన 22 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పథకాలకు పేరు మార్చిందే తప్ప.. క్షేత్రస్థాయిలో ఒక్క ప్రాజెక్టు కొత్తగా చేపట్టింది లేదు .ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (హెచ్ సిటీ) ప్రాజెక్టు కింద రూ. 7032 కోట్లతో 58 చోట్ల ఫ్లె ఓవర్లు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీలు, ఆర్‌యూబీలు, రహదారుల విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించగా, పనుల్లో ఒక్క అడుగు ముందుకు పడలేదు.
ఎస్ఎన్డీపీ మొదటి దశ పనులను పూర్తి చేయలేకపోయింది. ఫలితంగా ఇటీవల కురిసిన వర్షాలకు అనేక కాలనీల్లో వరద ముంచెత్తింది. సీఆర్ఎంపీ రోడ్ల నిర్వహణలో ఆదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుండడంతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. సంక్షేమ పథకాల ఆమలులోనూ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మొత్తంగా 15 నియోజకవర్గ ప్రజలకు రాబోయే 39 రోజుల పాటు మరిన్ని ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.