బంజారాహిల్స్, జూలై 16: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తుల పేరుతో జారీ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాజేసిన ఘటనలో ఇద్దరు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా చేరియాల్ మండలానికి చెందిన రాల్లబండి వెంకటేశ్ అనారోగ్య సమస్యలతో 2022 జూన్‌లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరగా.. సర్జరీ చేశాడు.
మూడునెలల తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఇటీవల తన సీఎంఆర్ఎఫ్ చెక్కు గురించి వాకబ్ చేయగా రూ.45వేల చెక్కు జారీ అయిన ట్లు, జూబ్లీహిల్స్‌లోని ఎస్బీఐలో చెక్కును వేసి డబ్బులు డ్రా చేసుకున్నట్లు తేలింది.
దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టి నిందితులైన సికింద్రాబాద్ మెట్టుగూడకు చెందిన జోగుల నరేశ్‌కుమార్(42), హస్తినాపురం ప్రాంతానికి చెందిన బాలగోని వెంకటేశ్‌లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కుతరలించారు. ఈ వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన కొర్లపాటి వంశీ, గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్‌ల పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. వీరంతా ముఠాగా ఏర్పడి 19 చెక్కులను బ్యాంక్‌లో వేసి డబ్బులు కాజేశారని తేలింది.