సిటీబ్యూరో, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): గ్రేటర్ పరిధిలో విద్యుత్ డిమాండ్ వినియోగం, గతేడాది వేసవితో పోల్చుకుంటే గణనీయంగా పెరగనుందని అధికారులు అంచనా వేశారు. గతేడాది 3756 మెగావాట్లుగా ఉన్న గరిష్ఠ డిమాండ్ ఈ ఏడాది దాదాపు 16 శాతం వృద్ధితో 4352 మెగావాట్లుగా నమోదైంది. గతేడాది 81.39 మిలియన్ యూనిట్లుగా ఉన్న వినియోగం దాదాపు 12 శాతం వృద్ధితో 90.68 మిలియన్ యూనిట్లకు చేరింది.
రాబోయే 2025 వేసవిలో సైతం విద్యుత్ డిమాండ్ గతం కంటే ఎక్కువగా రికార్డు స్థాయిలో గణనీయంగా వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేశారు. డిమాండ్ ఎంత పెరిగినా సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలనే ప్రభుత్వ ఆదేశానుసారం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు, అధికారులు సిబ్బంది సెక్షన్ స్థాయిలో డిమాండ్‌ను మదింపు చేస్తూ తగు ఏర్పాట్లు చేసే పనుల్లో నిమగ్నం అవుతున్నట్లు చెప్పారు.
రానున్న వేసవిలో పెరగనున్న డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్ సరఫరాకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తగు చర్యలు చేపట్టింది. సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముషారఫ్ ఫరూఖీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ వేసవి సన్నాహక చర్యల్లో భాగంగా జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. మేడ్చల్ పరిధిలో బౌరంపేట్‌లో నిర్మితమవుతున్న 132 కేవీ సబ్‌స్టేషన్‌ను, టవర్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. అలాగే బౌరంపేట్ 33/11కేవీ సబ్ స్టేషన్లో అదనంగా ఏర్పాటు చేసిన 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో వేసవి సన్నాహక చర్యల్లో భాగంగా చేపట్టిన పనుల్లో హైదరాబాద్ సెంట్రల్ సర్కిల్ పరిధిలో 35, 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్‌లింకింగ్, 149 డిస్ట్రిట్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేయనున్నారు. హబ్సిగూడ సర్కిల్ పరిధిలో 90, 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్‌లింకింగ్, 14, 33 కేవీ ఫీడర్ల విభజనతో పాటు తదితర సర్కిల్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయి పెంపు, అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
విద్యుత్ డిమాండ్‌లో భారీ పెరుగుదలకు అవకాశమున్న రంగారెడ్డి జోన్ల పరిధిలో 254, 11 కేవీ ఫీడర్ల విభజన, ఇంటర్‌లింకింగ్, 1252 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల స్థాయి పెంపు,అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీ ఎస్పీడీసీఎల్ చీఫ్ ఇంజినీర్ మేడ్చల్ అట్లూరి కామేశ్, ట్రాన్స్‌కో చీఫ్ ఇంజినీర్ వై.చిరంజీవులు తదితరులు పాల్గొన్నారు.