బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఎస్ఆర్డీపీ మరో మైలురాయిని చేరుకుంటున్నది. పాతబస్తీ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. నేడు శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీరిదిద్దే చర్యల్లో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వం స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ద్వారా రికార్డు సమయంలో 37 ప్రాజెక్టులను పూర్తి చేసి.. ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం చూపింది. విస్తరిత ప్రాంతాలతో పాటు ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకున్న పాతనగర వాసులకు ఉపశమనం కల్పిస్తూ.. ఓవైసీ ఫ్లై ఓవర్, ఆరాంఘర్-జూపార్క్ ఫ్లై ఓవర్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చి.. పాతనగర ట్రాఫిక్ కష్టాలకు విముక్తి కల్పించింది. ఇందులో భాగంగానే 90 శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే పూర్తయిన శాస్త్రిపురం ఆర్వోబీ ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సుమారు రూ. 71 కోట్లతో 490 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ బ్రిడ్జి..ఉద్దంగడ్డ రైల్వే గేట్ వద్ద వాహనదారులు పడుతున్న నరకయాతనకు ముగింపు పలకనున్నది.
– సిటీబ్యూరో
సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌ను సిగ్నల్ రహిత నగరంగా మార్చాలన్న సంకల్పంతో కేసీఆర్ ఎస్ఆర్డీపీ పథకానికి శ్రీకారం చుట్టారు. రూ.5937కోట్ల అంచనా వ్యయంతో జీహెచ్ఎంసీ 42 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. 42 ఫ్లై ఓవర్లలో 37 చోట్ల పనులు వాయువేగంతో పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. బీఆర్ఎస్ హయాంలోనే 90 శాతం మేర పురోగతి లో ఉన్న పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కొక్కటిగా నెమ్మదిగా పూర్తి చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు చోట్ల ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా శాస్త్రిపురం ఆర్వోబీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే మంజూరై, మెజారిటీ పనులు పూర్తయ్యాయి. సుమారు రూ. 71 కోట్లతో 490 మీటర్ల పొడవుతో నిర్మించిన ఈ వంతెన అందుబాటులోకి వస్తే..ఉద్దంగడ్డ రైల్వే గేట్ వద్ద వాహనదారులు పడుతున్న కష్టాలకు చెక్ పడుతుంది.
సికింద్రాబాద్ – ఫలక్‌నుమా – శివరాంపల్లి రైల్వే లైన్ మధ్య శాస్త్రిపురం వద్ద లెవల్ క్రాసింగ్ కారణంగా ఎదురవుతున్న ట్రాఫిక్ చికులకు శాశ్వత పరిషారం లభించనున్నది. మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఫలక్‌నుమా ఆర్టీసీ బస్ డిపోను కలిపే ప్రధాన రహదారిపై నిర్మించిన ఈ భారీ గ్రేడ్ సెపరేటర్ ఆర్వోబీ ఎట్టకేలకు నేటి నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంలో అత్యాధునిక ప్రమాణాలను పాటించారు. సుమారు 490 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మించారు. ఈ బ్రిడ్జిలో 37.28 మీటర్ల మేర రైల్వే భాగం ఉంది. సింగిల్ పియర్స్, ఆర్సీసీ ప్రీ-కాస్ట్ పియర్ క్యాప్స్, పటిష్టమైన స్టీల్ గర్డర్లను సూపర్ స్ట్రక్చర్‌గా ఉపయోగించారు. ప్రయాణం సాఫీగా సాగేందుకు మాడ్యులర్, స్ట్రిప్ సీల్ ఎక్స్ ప్యాన్షన్ జాయింట్లను అమర్చారు. ప్రీ-కాస్ట్ ఫ్రిక్షన్ స్లాబ్స్ , పటిష్టమైన క్రాష్ బారియర్లతో అప్రోచ్ రోడ్లను సిద్ధం చేశారు.
ఈ ఆర్వోబీ అందుబాటులోకి రావడంతో మైలార్ దేవ్ పల్లి నుంచి వట్టేపల్లి మీదుగా ఫలక్ నుమా డిపోకు వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి. ప్రస్తుతం రైల్వే గేటు పడిన ప్రతిసారీ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ బ్రిడ్జి ద్వారా ప్రయాణ సమయం సుమారు 30 నిమిషాల మేర ఆదా అవుతుంది. వాహనాలు నిలబడకుండా సాఫీగా సాగడం వల్ల ఇంధన వినియోగం తగ్గడమే కాకుండా, కాలుష్య స్థాయిలు కూడా గణనీయంగా తగ్గుతాయని అధికారులు పేరొంటున్నారు. నిత్యం రైల్వే గేటు పడటంతో అసహననాకి గురయ్యే వాహనదారుల ఇబ్బందులు కూడా తీరనున్నాయి. మొత్తానికి పాతబస్తీ రవాణా ముఖచిత్రాన్ని ఈ ఆర్వోబీ మార్చనున్నది.