Hyd Metro | ఈ నెల 8న హైదరాబాద్ మెట్రో రెండో దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గం పనులను ప్రారంభించనున్నారు. 5.5 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో మూడు కారిడార్లలో కలిసి 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్నది. మియాపూర్-ఎల్బీ నగర్, జేబీఎస్-ఎంజీబీఎస్, నాగోల్ -రాయదుర్గం వరకు మెట్రో మార్గం ఉన్నది.
రెండో దశలో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకున్న రెండో కారిడార్‌ను ఫేజ్–1లో ప్రతిపాదించిన ఫలక్‌నుమా వరకు పొడిగించగా.. అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్స్ వరకు మొత్తంగా 7 కిలోమీటర్ల పొడిగించాలని కొత్త రూట్‌మ్యాప్‌లో ప్రతిపాదించారు. 4వ కారిడార్‌లో నాగోల్ మెట్రో నుంచి ఎల్బీనగర్ నుంచి మెట్రో వరకు.. అక్కడి నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్ రోడ్డు, మైలార్దేవ్ పల్లి, పీ7 రోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు 29 కిలోమీటర్లు.. మైలార్దేవ్ పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేంద్రనగర్‌లో ప్రతిపాదించిన హైకోర్టు వరకు నాలుగు కిలోమీటర్లు ఉంటుంది.
ఇక 5వ కారిడార్‌లో రాయదుర్గం నుంచి బయో డైవర్సిటీ జంక్షన్, నానక్ రామ్ గూడ జంక్షన్, విప్రో జంక్షన్, అమెరికన్ కాన్సులేట్ వరకు 8 కిలోమీటర్లు విస్తరించాలని ప్రతిపాదించారు. 6వ కారిడార్‌లో మియాపూర్ నుంచి బీహెచ్ఈఎల్ మీదుగా పటాన్చెరు వరకు 14 కిలోమీటర్లు.. 7వ కారిడార్‌లో ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు ఎనిమిది కిలోమీటర్లు విస్తరించాలని ప్రతిపాదించగా.. ప్రభుత్వం ఆమోదం తెలిపింది.