MLA Vemula Prashanth reddy | హైదరాబాద్: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని తాడ్వాయి మండలంలో రైతులు యూరియా యాప్ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సకాలంలో యూరియా దొరకడం లేదనే బాధతో నిరసన కార్యక్రమం చేపట్టారని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రైతుల పిలుపు మేరకు, ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సురేందర్ నాయకత్వంలో తామంతా అక్కడికి బయల్దేరాలని నిర్ణయించుకున్నామని, అయితే ఈ రోజే తనను హైదరాబాద్‌లోనే హౌస్ అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమని ఎమ్మెల్యే వేముల మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటువంటి నియంతృత్వ పాలనతో సాధించేదేమీ ఉండదని ఎమ్మెల్యే వేముల హితవు పలికారు. “మమ్మల్ని అరెస్ట్ చేసి మా గొంతు నొక్కే బదులు, అక్కడ రైతులకు ఇబ్బందిగా మారిన యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు అన్-సీజన్లోనే దేశంలో ఎక్కడ యూరియా దొరికినా కొనుగోలు చేసి గోదాముల్లో నిల్వ ఉంచేవారు. రైతులు ఆటో వానికి పైసలు ఇచ్చి పంపిస్తే, నేరుగా పొలాల వద్దకే యూరియా సంచులు వచ్చే పరిస్థితి ఉండేదని , అందుకే రైతన్నలకు ఎలాంటి కొరత లేకుండా యూరియా దొరికిందని గుర్తుచేశారు. ఆ తెలివి ప్రస్తుత ముఖ్యమంత్రికి లేదన్నారు. రైతులకు సరిపడా యూరియాను విరివిగా అందుబాటులో ఉంచాలి” అని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి అంతా హైదరాబాద్‌లో భూములు ఎక్కడున్నాయి. వాటిని ఏం చేయాలనే దానిపైనే ఉంది తప్ప, రైతుల బాధలపై లేదని ఎమ్మెల్యే వేముల విమర్శించారు. నిన్న మొన్నటి దాకా వడ్ల కొనుగోలు కోసం రైతులను ఏడు చెరువుల నీళ్లు తాగించారని, ఇప్పుడు యూరియా కోసం ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి నిరసన తెలుపుతామంటే, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో దాదాపు 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పొద్దున నుంచి అరెస్ట్ చేసి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ఇంచార్జ్ సురేందర్ , తాడ్వాయి మండల కేంద్రంలో డీసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డిలను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని, రోడ్ల మీదికి వస్తున్న రైతులను సైతం వదలకుండా అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు.
రైతుల్లో వచ్చే తిరుగుబాటును మాత్రం ఆపలేరు..
కామారెడ్డి పట్టణంలో బాన్సువాడలో కూడా బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారన్నారు.‘ప్రజా పాలన తెస్తామన్న రేవంత్ రెడ్డి ఇవాళ నియంతృత్వ పాలన సాగిస్తున్నారు. అరెస్టులతో మా గొంతు నొక్కే బదులు యూరియా యాప్ రద్దు చేసి సరిపడా యూరియా రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిది ప్రజా పాలనా లేక నియంత పాలనా అనేది తెలంగాణ సమాజం, ప్రజా సంఘాలు ఆలోచించాలి. ఎక్కడో కామారెడ్డి జిల్లాలో నిరసన ఉంటే హైదరాబాద్‌లో మమ్మల్ని అరెస్ట్ చేయడం ఈ ప్రభుత్వం ఎంత నియంతృత్వంగా పనిచేస్తుందో చెప్తోంది. మమ్మల్ని అరెస్ట్ చేసినా రైతుల్లో వచ్చే తిరుగుబాటును మాత్రం ఆపలేరు. రైతులు తప్పకుండా బుద్ధి చెప్తారు’అని ఎమ్మెల్యే వేములహెచ్చరించారు.
ఢిల్లీకి 72 సార్లు వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెట్రో రైలు పైన సమావేశాలు పెట్టడానికి సమయం ఉంటుంది కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని యూరియా గురించి అడిగే శ్రద్ధ లేదన్నారు. రేవంత్ రెడ్డికి రైతులంటే చాలా చులకన భావం ఉందని విమర్శించారు. అటు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా రాష్ట్రానికి రావాల్సిన యూరియాను ఒకేసారి ఇవ్వకుండా కోతలు విధిస్తోందని, ఇటు రేవంత్ రెడ్డికి కేంద్రం నుండి తెచ్చుకునే తెలివి లేదని దుయ్యబట్టారు.
ప్రతిపక్షాలుగా తాము రైతుల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంటే వినే ఓపిక లేకపోగా, రివర్స్‌లో అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అటు నరేంద్ర మోదీ, ఇటు రేవంత్ రెడ్డి.. ఈ రెండు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యూరియా విషయంలో, వడ్ల కొనుగోలు విషయంలో తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నాయని ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రైతుల సమస్యలపై పోరాడితే గృహ నిర్బంధాలా❓
కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS🔥
రైతుల తరఫున ప్రశ్నించే నాయకులను అణిచివేయాలని ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య
రైతులకు ఎరువుల సరఫరాలో ఏర్పడిన తీవ్ర సమస్యలను… pic.twitter.com/hNSxd0Tdpe
— BRS Party (@BRSparty) June 23, 2026