‘ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం టీహబ్ సహకారంతో ఓలా మాదిరిగా రాష్ట్రంలో ప్రత్యేక యాప్ తీసుకొస్తాం. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామని రాహుల్‌గాంధీ మాటిచ్చారు. ఆ హామీలో భాగంగా ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్రంలో యాప్ ఏర్పాటుపై విధాన నిర్ణయం తీసుకుంటాం’
– 2023 డిసెంబర్ 23న ఆటో డ్రైవర్ల మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ
హైదరాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లకు యాప్ తీసుకొస్తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీకి 22 నెలలు గడిచింది. ఆచరణలో మాత్రం ఒక్క అడుగూ ముందుకు పడలేదు. అన్ని హామీల మాదిరిగానే ఆటో డ్రైవర్లకు యాప్ హామీ కూడా అటకెక్కింది. ఉచిత బస్సు పథకంతో రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధి కరువై కుటుంబాలు గడవడమే కష్టంగా మారింది. ఆటో ఫైనాన్స్ కిస్తీలు చెల్లించలేక సమస్యల వలయంలో చిక్కుకుపోయారు. చాలా కుటుంబాల్లో కుటుంబాలు గడవడమే కష్టమైంది. ఈ తరుణంలో ఎందరో ఆటోడ్రైవర్లు తనువు చాలించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన 2023 డిసెంబర్ 9 నాటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రంలో 161 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో అత్యధికంగా హైదరాబాద్‌లో 37 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలైన మెదక్‌లో 27, వరంగల్ 19, ఖమ్మం 16, ఆదిలాబాద్ 15, కరీంనగర్ 15, నిజామాబాద్ 11, మహబూబ్‌నగర్ 8, నల్లగొండ 7, రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు ఆటో డ్రైవర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు ఓవైపు కలవరపెడుతుంటే, వారికి ఉపాధి అవకాశాలు కల్పించి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తున్నది. టీహబ్ సహకారంతో ఓ ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఇచ్చిన హామీ 22 నెలలైనా అమలు కాలేదంటే ఆటోడ్రైవర్ల సమస్యలపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమవుతున్నది.
అమలుకు నోచని హామీలు
ఎన్నికల సమయంలో ఆటోడ్రైవర్ల బతుకుల్లో వెలుగులు నింపుతామని కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికింది. అనుకున్నదే తడవుగా మ్యానిఫెస్టోలో పలు కీలక హామీలను పొందుపర్చింది. ఏటా ఆటోడ్రైవర్లకు రూ.12 వేల చొప్పున ఆర్థికసాయం, రవాణా వాహనాల ఫిట్నెస్ చలానాలను ఏటా సమీక్షించి సవరిస్తామని భరోసా ఇచ్చింది. ఆటోడ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేసి సామాజిక భద్రత కల్పిస్తామని, ప్రతి పట్టణంలో ఆటోనగర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. పెండింగ్‌లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలానాలు 50 శాతం రాయితీతో పరిష్కరిస్తామని కూడా మ్యానిఫెస్టోలో పొందుపర్చింది. మ్యానిఫెస్టో తనకు పవిత్ర గ్రంథాలతో సమానమని చెప్పిన రేవంత్‌రెడ్డి.. అసలు ఆ హామీల ఊసే ఇప్పుడు ఎత్తకపోవడం గమనార్హం. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా అందక ఆటో డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు.
ఆటో డ్రైవర్లను సర్కారే ఆదుకోవాలి
ఉచిత బస్సు పథకంతో నష్టపోయిన ఆటోడ్రైవర్లను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలి. టీహబ్ సహకారంతో ఆటోడ్రైవర్ల కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకొస్తామని గతంలో ఇచ్చిన హామీని సీఎం రేవంత్‌రెడ్డి నిలుపుకోవాలి. ఆటోడ్రైవర్లకు ఏటా రూ.12 వేల ఆర్థికసాయం అందజేయాలి. ఆటో, రవాణారంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటుచేయాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 వేల కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలి. ఆటోలకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వమే చెల్లించాలి. ప్రమాద బీమాను రూ.10 లక్షలకు పెంచి సాధారణ మరణాలకు వర్తింపజేయాలి. 50 ఏండ్లు నిండిన ఆటో డ్రైవర్లకు వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలి. ఆటోడ్రైవర్లకు పార్కింగ్ స్థలాలు కేటాయించాలి.
-వేముల మారయ్య, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు