Elevated Corridor | సిటీబ్యూరో, (నమస్తే తెలంగాణ) / కంటోన్మెంట్/బొల్లారం, మార్చి 7 : ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం త్వరలోనే సాకారం కానున్నది. హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లు జనం పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనున్నది.
ఉత్తర తెలంగాణలోని జిల్లాలకు బస్సులు బయలుదేరే జేబీఎస్ నుంచి ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్ఆర్) వరకు కంటోన్మెంట్ ప్రాంతం ఉండడంతో ఆ ప్రాంతంలో రహదారుల విస్తరణకు ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. కంటోన్మెంట్ ప్రాంతంలోని భూములు రక్షణ శాఖ పరిధిలోనివి కావడం, వాటి బదలాయింపునకు ఆ శాఖ సుముఖంగా లేకపోవడంతో ఈ రహదారుల విస్తరణపై గత ప్రభుత్వం చూపిన ప్రత్యేక శ్రద్ధ కారణంగా నేడు ఫలితం సఫలీకృతమైంది.
సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి రక్షణ శాఖ భూములు తమకు అప్పగించాలని, ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేంద్రం అంగీకరిస్తూ మార్చి ఒకటో తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి నడుంబిగించింది.
సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై వెస్ట్ మారేడ్‌పల్లి, కార్ఖానా, తిరుమలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ సమీపంలోని ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు.
ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ ఫర్ డే -పీసీయూ) ప్రయాణిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. అసలే ఇరుకైన రహదారి.. ఇంత పెద్ద మొత్తంలో వాహనాల రాకపోకలతో ఈ మార్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు, ప్రయాణికులు హడలిపోతున్నారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలిసిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి.
భూమి పూజ అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తున్న సమయంలోనే వుయ్ డిమాండ్ మేడ్చల్ మెట్రో అంటూ మెట్రో సాధన సమితి సభ్యులు నినదించారు. బహుళ ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టులను చేపట్టాల్సిన ప్రభుత్వం ప్రచార ఆర్భాటంగా భూమి పూజ చేయడంపై అసహనం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ అధికారులు ప్రదర్శించిన ప్రాజెక్టు వివరాలపై సాధన సమితి సభ్యులు మాట్లాడారు. ఈ ప్రాజెక్టు వలన భవిష్యత్తులో మెట్రో విస్తరణ సాధ్యపడదని వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ రెండు కారిడార్లలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు చేసిందనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హయాంలో… కేవలం డిఫెన్స్ శాఖ నుంచి భూములను తీసుకున్నామని చెప్పుకోవడానికే అన్నట్లుగా.. ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ హడావుడిగా మొదలుపెట్టిందన్నారు.