సిటీబ్యూరో: హైదరాబాద్‌కు గోదావరి జలాల తరలింపుపై సమగ్రమైన నివేదిక సిద్ధం చేయాలని వాటర్‌బోర్డు అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల నీటిని తరలించేందుకు డిసెంబర్ 1 వరకు టెండర్ ప్రక్రియకు కార్యాచరణ రూపొందించాలన్నారు. జంట నగరాల తాగునీటి అవసరాల కోసం 20 టీఎంసీల నీటి తరలింపుపై ఇరిగేషన్, జలమండలి అధికారులతో జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమీక్షించారు. కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటి తరలింపు ప్రణాళికలపై నివేదిక తయారు చేయాలని సూచించారు. నీటి లభ్యత, ఏ ప్రాజెక్టు నుంచి ఎంత మేరకు నీటిని తరలించాలి, ఎంత ఖర్చు అవుతుందనే విషయాలపై పూర్తి అధ్యయనం చేయాలన్నారు. ఈ విషయంలో అవసరమైతే మిషన్ భగీరథ అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలన్నారు.
అన్ని మెట్రో నగరాలకు దీటుగా హైదరాబాద్ నిలబడుతున్నది. గడిచిన పదేండ్లలో అనూహ్యంగా విస్తరించిన పారిశ్రామికీకరణతో నగరంలో నీటి అవసరం భారీగా పెరుగుతున్నది. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సిటీకి గోదావరి జలాలను తరలించాలనే ప్రణాళికలను గతంలోనే బీఆర్ఎస్ సర్కారు సిద్ధం చేసింది. తాగునీటి అవసరాలతోపాటు, పారిశ్రామిక అవసరాలను తీర్చే విధంగా డిజైన్లు రూపకల్పన చేసింది. ఓఆర్ఆర్ చుట్టూరా రింగ్ మెయిన్ ప్రాజెక్టు ద్వారా అందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పన కూడా పూర్తి చేసింది. సిటీ చుట్టురా విస్తరించిన మున్సిపాలిటీలకు తాగునీటిని అందించేలా ఈ ప్రాజెక్టును చేపట్టింది. దీంతోపాటు గోదావరి జలాలను కూడా తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను బీఆర్ఎస్ సర్కారు పూర్తి చేసింది.