సిటీబ్యూరో: మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని అభాసుపాలు చేస్తోంది. రూ. 50వేల కోట్లతో లండన్‌లోని థేమ్స్ తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్పిన మూడు నెలల్లోనే రూ. లక్ష కోట్లు పెంచిన నయా అంచనా వ్యయం.. కాస్తా మూసీ పేరిట కాంగ్రెస్ చేసే నయవంచనగా మారుతుందంటూ విమర్శలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి మూసీ బ్యూటీఫికేషన్ ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకునే ఆలోచనలు చేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక సామాజికవేత్తలు, పర్యావరణ నిపుణులు, రాజకీయ పార్టీలు నేరుగా ఈ ప్రాజెక్టు విషయంలో కుట్రలు ఉన్నాయంటూ కుండబద్ధలు కొడుతున్నారు.‘
సీఎం రేవంత్‌కు చిత్తశుద్ధి ఉంటే.. నగర జీవన ప్రమాణాలను పెంచేలా విద్యా, రవాణా, ఆరోగ్య సేవలను మెరుగుపరచాలి. అంతేగానీ..కార్యాచరణ లేకుండా మూసీ అంచనాలు పెంచడం వెనుక పెద్ద కుట్రనే సాగుతోంది. ’ అంటూ సీనియర్ జర్నలిస్ట్ విఠల్ స్పష్టం చేస్తే.. ‘మూసీ సుందరీకరణ కాదు.. మురికివాడల్లో ఉంటున్న ప్రజలకు మౌలిక వసతులను అభివృద్ధి చేసే దమ్ము ఉందా’ అంటూ సీనియర్ న్యాయ నిపుణులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సవాల్ విసిరారు. ఇలా మూసీ సుందరీకరణ నయా అంచనాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నయవంచనపై జనాలు గొంతెత్తుతూనే ఉన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మూసీ విషయంలో చిత్తశుద్ధిని ప్రదర్శిస్తూ… ప్రజాధనంపై ఉన్న దాహాన్ని తగ్గించుకోవాలంటూ వ్యాఖ్యలు చేస్తుంటే.. బీజేపీ నేరుగా రేవంత్‌రెడ్డి లక్ష్యంగా ఆరోపణలు చేస్తున్నది. కాగా, సీనియర్ జర్నలిస్టులు పాశం యాదగిరి, విఠల్, సీనియర్ న్యాయ నిపుణులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ వంటి సామాజిక బాధ్యత కలిగిన మేధావులు సీఎం రేవంత్‌రెడ్డి తీరును ప్రశ్నించారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి మూసీపై చూపుతున్న చొరవను ఎత్తిచూపుతున్నారు. ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ లూటీ చేసే కుట్రలేనని వ్యాఖ్యానిస్తున్నారు. అంతగా కావాలంటే నగరంలో పడకేసిన రవాణా, విద్యా, వైద్య సేవలను మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.