సికింద్రాబాద్ : రాష్ట్రంలోని దళితుల ఆర్థికాభివృద్ధికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన సుమారు 100 మంది దళితులకు దాదాపు రూ.10కోట్ల మేర నిధులు ఆయా ఖాతాల్లో జమ అయ్యాయి. ఈ క్రమంలో ఆదివారం కార్కానాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్యే సాయన్నను బోర్డు మాజీ సభ్యులు, దళితబంధు లబ్దిదారులు ఘనంగా సన్మానించారు.
దీంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సాయన్నతో కలిసి లబ్దిదారులు పాలాభిషేకం చేశారు. అనంతరం బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా దళిత సాధికారత కోసం దేశంలోనే ఎక్కడాలేని విధంగా పథకాలు అమలు చేస్తున్నారని ఆయన వివరించారు.
లబ్దిదారులు లాభదాయక యూనిట్లను ఎంపిక చేసుకోవాలని కోరారు. దళితుల అభివృద్ధి, సంక్షేమం కోసం అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన దళిత కుటుంబాలకు వంద శాతం సబ్సిడీతో రూ.10లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి ద్వారా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థులకు రూ.20 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నదని చెప్పారు.
సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని పేర్కొన్నారు. దళితులు కూడా సామాజికంగా, ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశ్యంతో కార్యక్రమం ప్రారంభించారని తెలిపారు. దేశంలోని దళితులందరు ఇలాంటి కార్యక్రమం తమకు అమలు చేయాలని ఆయా రాష్టాల్లో డిమాండ్ చేసే రోజు వస్తుందని అన్నారు. దళితులను ఉన్నత స్థాయిలో చూడాలన్నదే సీఎం కేసీఆర్ కల అని అన్నారు.
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సంక్షేమ కోసం ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి అన్నారు. దళితుల పట్ల సమాజంలో నెలకొన్న తారతమ్యాలను రూపు మాపడమే దళిత బంధు పథకం ప్రధాన ఉద్దేశమన్నారు, కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు పాండుయాదవ్, లోక్నాథ్, నళినికిరణ్, ప్రభాకర్, నేతలు నివేదిత, టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి మధుకర్, పిట్ల నాగేష్, మురళీయాదవ్, భాస్కర్ ముదిరాజ్, కిరణ్, విజయ్, శ్రీహరి, సరిత, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు.